కార్పొరేట్ కొలువులు వదులుకొని చాలామంది యువత పల్లెబాట పడుతున్నారు. వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. వారసత్వంగా వస్తున్న భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేందుకు సిద్దపడుతున్నారు. వ్యవసాయం అంటే ఏసీ కింద .. ఫ్యాన్ కింద ... కంప్యూటర్ ఎదుట కూర్చోవడం కాదుకా మరి.. పెట్టుబడి..కూలీల ఖర్చులు... నారు మళ్ల దగ్గర నుంచి కోత కోసేవరకు కూలీలదే కీలక పాత్ర. అయితే పొలంలో కలుపు తీయడానికి కూలీల అవసరం లేకుండా ఓ యువరైతు వినూత్న ప్రయోగం చేసి... పాత సైకిల్ తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు. పొలంలో పాత సైకిల్ తో కలుపు తీస్తూ తోటి రైతులను ఆకర్షిస్తున్నాడు.
సరికొత్త ఆలోచన
వ్యవసాయంలో విత్తనాలు, పురుగు మందులు దొరక్క రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు కూడా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇంత కష్టపడి పంట పండిస్తే మద్దతు ధర కరువు. దాచుకోవడానికి నిల్వ సౌకర్యం లేదు. ఇవికాక సమయానికి కూలీలు దొరక్క ఇతర రాష్ట్రాల నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా కూలీల కొరత తో పాటు ఎద్దులతో గుంటక కొట్టించడానికి ఖర్చు ఎక్కువవుతుంది. గుంటుకకు ప్రతిరోజు 800 రూపాయల కిరాయి అవుతుందని రైతులు అంటున్నారు. దీంతో పత్తి చేలో ఈజీగా కలుపు తీసేందుకు సరికొత్త ఆలోచన చేశాడు. పాత సైకిల్ తో ఓ ప్రయోగం చేశాడు.
20 వేల రూపాయల వరకు ఆదా
కృషి ఉంటే మనుషులు బుషులు అవుతారు .... . మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాని నిరూపించాడు ఈరైతు. పాత సైకిల్ కు వ్యవసాయ పరికరాలను అమర్చి కలుపు తీయడం, గుంటుక కొట్టడం ప్రారంభించాడు. దీంతో కూలీల కొరతను అధిగమించడం తో పాటు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేసేందుకు ఈ సైకిల్ గుంటుక కూడా ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందని, ఒక ఎకరంలో ముగ్గురు కూలీలు చేసే పనిని ఈ సైకిల్ గుంటుకతో ఒక్కరు చేస్తున్నానని చెబుతున్నాడు. ఈవినూత్న పరికరంతో కలుపు తీయడం, గుంటుక కొట్టడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. పొలంలో ఈజీగా కలుపు తీస్తున్నామని గుంటుక కొట్టడానికి ఇది అనుకూలంగా ఉందని చాలామంది రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనుల్లో ఉపయోగపడుతున్న ఈసైకిల్ లో కూలీల కొరతను తగ్గించుకొని సమయాన్ని ఆదా చేసుకుంటున్నామని రైతులు అంటున్నారు.