- వరంగల్ లో 230కి పైగా పాత బంగ్లాలు
- నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్న ఆఫీసర్లు
- ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో పాత బిల్డింగులు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. బిల్డింగులు కట్టి వందల ఏండ్లు దాటినా, వాటిని తొలగించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కూల్చివేతల్లో ఆఫీసర్లు తీవ్ర జాప్యం చేస్తుండడమే ప్రమాదాలకు కారణమవుతోంది. ఎవరైనా చనిపోతేనే.. కూల్చివేతల పేరిట కొద్దిరోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారు.
కూలుతున్న బతుకులు
ప్రమాదకర బిల్డింగుల తొలగింపులో లీడర్లు, ఆఫీసర్ల నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. కొద్దిరోజులుగా జోరు వర్షాలు కురుస్తుండగా.. పాత భవనాల గోడలన్నీ నానుతున్నాయి. ఏటా వానాకాలానికి ముందు పాత బిల్డింగులను గుర్తించాల్సి ఉన్నా.. ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బిల్డింగులు కూలి, ఘటనలో తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. వరంగల్ చౌరస్తాలో నిరుడు పాడుబడ్డ ఇల్లు కూలి, ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఏడాది జూన్ 10న చౌరబౌళి సెంటర్ లో పాత భవనం గోడ కూలి ఇద్దరు కూలీలు చనిపోయారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మండిబజార్ లో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
వందల ఏండ్లు దాటిన భవనాలు..
ఓరుగల్లులో వందల ఏండ్ల నాటి ఇండ్లు చాలా ఉన్నాయి. మూడేండ్ల కింద అప్పటి మేయర్గుండా ప్రకాశ్ ఆధ్వర్యంలో ఆఫీసర్లు తనిఖీలు చేసి, మొత్తం 908 ఓల్డ్ బిల్డింగులను గుర్తించారు. వాటిని సొంతంగా తొలగించుకోవాలని ఓనర్లకు నోటీసులు ఇచ్చారు. కానీ చాలా మంది ముందుకు రాలేదు. ఆఫీసర్లు సైతం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గతేడాది వరకు 379 ప్రమాదకర భవనాలు మిగిలి ఉండగా.. అందులో దాదాపు 145 ఇండ్లను కూల్చేసినట్లు ఆఫీసర్ల లెక్కలు చెబుతున్నాయి. అంటే 230కిపైగా ఇండ్లు ప్రమాదకర స్థితిలోనే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఈ సంఖ్యకు మించి ఉండడం గమనార్హం. కొందరు పాత బిల్డింగులకే కొత్త రంగులు వేసి, మేనేజ్ చేస్తున్నారు. ఇలాంటివి గుర్తించాల్సిన ఆఫీసర్లు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిటీలోని హనుమకొండ చౌరస్తా, వరంగల్ చౌరస్తా, మండి బజార్ తదితర ఏరియాల్లో ఓల్డ్ బిల్డింగులు ఎక్కువగా ఉన్నాయి.