ఓల్డ్ సిటీ మెట్రో లైన్ పనులు వేగవంతం MGBS టూ చంద్రాయన్ గుట్ట మెట్రో లైన్

ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట వరకు ఓల్డ్ సిటీ మెట్రో లైన్ భూసేకరణ కార్యక్రమం వేగవంతం చేశామని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎంఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్, చంద్రాయన్ గుట్ట మధ్య 7.5 కీలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి దాదాపు 1200 ఆస్తులపై ప్రభావం ఉంటుందని ఆయన వివరించారు. ఇందుకు గాను ఇప్పటికే భూసేకరణ చట్టం 2013 క్రింద 400 ఆస్తులకు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశామని వెల్లడించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ వార్తాపత్రికల్లో కూడా ఈ నోటిఫికేషన్లను ప్రచురించడం జరిగిందన్నారు.

జీహెచ్ఎంసి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే స్టేషన్ల వద్ద మాత్రం 120 అడుగుల వెడల్పులో విస్తరణ జరుగుతుందన్నారు. దారులీఫా జంక్షన్ నుండి శాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుతం రహదారి వెడల్పు 50 అడుగుల నుండి 60 అడుగుల వరకు, శాలిబండ జంక్షన్ నుండి చంద్రాయన్ గుట్ట జంక్షన్ వరకు 80 అడుగుల వెడల్పు ఉందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

దారుల్షిఫా, శాలిబండ మధ్య చాల ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుండి 25 అడుగుల చొప్పున విస్తరణ చేయాల్సి ఉంటుందని, అలాగే శాలిబండ నుంచి చంద్రాయన్ గుట్ట మధ్య ఒక్కో ఆస్తి 10 అడుగుల వరకు విస్తరణ చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టేషన్లు, వంపు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని భూసేకరణ  విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందన్నారు. 

సాంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు 3డీలో వీక్షించే విధంగా లైడార్ డ్రోన్ సర్వే కూడా చేసినట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీని వల్ల ప్రభావితం అయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులను కూడా వీక్షించవచ్చని అన్నారు. ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హెచ్ఎంఎల్ ఇంజినీర్లు, సిబ్బంది స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.  ఈ మెట్రో మార్గం వెంబడి ఉండే 103 మతపరమైన, సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ నిర్మాణాలను విలక్షణ ఇంజినీరింగ్ పద్దతుల ద్వారా సంరక్షించేలా, పిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎండీ తెలిపారు.ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులు హెచ్ఎంఎల్ భూ సేకరణ అధికారి కార్యాలయం వద్ద నిర్దిష్ట గడువులోగా తమ అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని, వివరాలు పొందవచ్చని ఆయన చెప్పారు. భూ సేకరణ చట్టం అనుసరించి చేపడుతున్న ఈ భూసేకరణ కార్యక్రమం 8 నెలల్లో పూర్తి కావచ్చని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.