కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపారు. విభజన హామీలు నెరవేర్చడంలేదు. బైసన్‌పోలో రక్షణశాఖ భూమిని అడిగినా ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు.. ఇలాంటి డైలాగ్‌లు గత ఐదేళ్లుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వంటి బీఆర్ఎస్ యజమానుల నుంచి రొటీన్ గా వింటూ వచ్చాం. నిజంగా వీరు చిత్తశుద్ధితో సాధించాలనుకుంటే వచ్చేవి కావా? లేదా కేంద్రంతో పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడాలనుకున్నారా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం నుంచి ఇప్పటికే అనేక పనులను సాధించుకోగలగడమే అందుకు సాక్ష్యం అనిచెప్పొచ్చు.
నిజానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో వైరుధ్యపార్టీలు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ కాంగ్రెసేతర పార్టీ. రాజకీయ కోణంలో చూసినట్లయితే, కేంద్రం రేవంత్ ప్రభుత్వం కన్నా, కేసీఆర్ ప్రభుత్వానికే ఎక్కువ సహకరించి ఉండాలి. కానీ, ఎందుకోగానీ, కేంద్రంతో ఘర్షణ వాతావరణాన్నే కేసీఆర్ కోరుకుంటూ వచ్చారు. నిజంగా కేంద్రమే కేసీఆర్ సర్కారుకు సహకరించలేదా, లేక కేసీఆరే బ్లేమ్గేమ్లు నడిపి దేశ్‌కీ నేత కావాలనుకున్నాడా? ఆయన ఉద్దేశం ఏమయి ఉంటుందని ప్రశ్నించుకుంటే.. మనకు ఆశ్చర్యకరమైన సమాధానాలే దొరుకుతాయి.
ప్రధానికి, కేంద్ర మంత్రులకు అది కావాలి, ఇది కావాలి అని లేఖలు ఇవ్వాలి. లేదా లేఖలు రాయాలి. కొద్ది రోజుల తర్వాత కేంద్రం ఇవ్వడంలేదనే ప్రకటనలు చేయాలి. వీలైతే ప్రెస్మీట్లు పెట్టి కేంద్రంపై దుమ్మెత్తి పోయాలి. ఏండ్ల తరబడి కేసీఆర్, కేటీఆర్ చేసిన రొటీన్ వ్యవహారం అది! ఢిల్లీలో లేఖలు ఇవ్వాలి, హైదరాబాద్ కు వచ్చాక కేంద్రాన్ని నిందించాలి. కానీ, కేంద్రాన్ని కోరిన వాటిపై చిత్తశుద్ధితో దృష్టిపెట్టి ప్రాసెస్ ను ఫాలో అయ్యేవాళ్లా అంటే అనుమానమే! అడిగింది ఇచ్చేస్తే కేంద్రాన్ని నిందించడం సాధ్యం కాదనుకునే వారేమో తెలియదు! సాధించాలనే పట్టుదలతో వినతులను ఫాలో అప్ చేసి ఉంటే, చాలామేరకు సాధ్యమయ్యేవేమో! మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రానికి ఇచ్చిన వినతులను బాగానే ఫాలో అప్ చేసిందనే చెప్పాలి.
ఫలితంగానే, ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పనులకు కేంద్రం నుంచి క్లియరెన్స్ వచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని సాధించగలిగింది. సికింద్రాబాద్ రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేయగలిగింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ కు మొన్ననే శంకుస్థాపన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలాగ బ్లేమ్గేమ్లకే పరిమితం కాకుండా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి చేసిన వినతుల ప్రాసెస్‌ను ఫాలో అప్ చేయగలిగింది కాబట్టే వాటిని సాధించగలిగింది. కానీ, ఇచ్చిన వినతుల ప్రాసెస్ పై దృష్టిపెట్టకుండా, కేవలం బ్లేమ్‌గేమ్ ల కోసమే వినతులిస్తే పనులు జరగవు కదా!
మైలేజీ కావాలంటే‘ జాతీయ హోదా’ అడగాల్సిందే
కేంద్రం ఇవ్వలేనివి అడగాలి. తదుపరి దుమ్మెత్తిపోయాలి. ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టుకు సహజంగానే జాతీయ హోదా ఇవ్వడం అంత సులభం కాదు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియదని కాదు! కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేకన్నా ముందే జాతీయహోదా కోసం దాన్ని కేంద్రానికి వదిలేసి పోరాడి ఉంటే వచ్చేది కాదా? ఇకపోతే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగడంలో న్యాయం ఉంది.
కానీ దాని సాధన కోసం తీవ్ర ప్రయత్నం చేసిన పాపానపోలేదు. దానికోసం 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఏనాడూ పార్లమెంటును స్థంబింప చేసింది లేదు. జంతర్‌మంతర్ వద్ద స్వయాన కేసీఆరే ధర్నా చేసిఉంటే అది సాధ్యమయ్యేదా కాదా తేలిపోయేది! పొలిటికల్ మైలేజీ అవసరమైనపుడు మాత్రమే పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వడంలేదని నిందించడానికి ఆ డిమాండ్‌ను పరిమితం చేసుకున్నారు! కేసీఆర్ దృష్టి అంతా బ్లేమ్‌గేమ్ పైనే నడిచింది! అలాగే, ఎంతసేపూ స్వలాభం కోసం అడ్డగోలుగా ప్రాజెక్టుల వ్యయం పెంచారనే విపక్షాల ఆరోపణకు తగినట్లుగానే కేసీఆర్ పోకడ ఉండింది.
ప్రజల ఆరోగ్యం గాలికొదిలేసి..
ఇక్కడ మరొక ఉదాహరణ . అప్పట్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సైతం కేసీఆర్ ప్రభుత్వం వద్దన్నది. దాన్ని మూడేండ్ల పాటు తిరుగు ముఖం పట్టించారు. మాది సంపన్న రాష్ట్రమని అందరూ నమ్మాలనుకున్నారు. అంతకంటే మా ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుందని తమకు తామే కితాబులిచ్చుకొని కేంద్ర పథకాన్ని కాలదన్నారు. కానీ, ఇంట్ల ఈగల మోత, బయట పల్లకీ మోతకు అలవాటు పడ్డారు! ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకు పోతుంటే భరించలేక మూడేండ్ల తర్వాత.. , వద్దన్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తిరిగి అంగీకరించి ఆరోగ్యశ్రీ పథకంలో కలిపేసుకున్నారు.
కానీ సుమారు 4 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకానికి దూరం చేశారు, వంచితులను చేశారు. అనేక మంది పేదలు ఉచిత వైద్యం పొందలేక నష్టపోయారు. కేంద్ర పేదల ఇండ్ల పథకం ఆవాస్ యోజన పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించలేదు. ఆ పథకం ద్వారా కొందరు పేదల ఇండ్ల కల అయినా నెరవేరేది కదా? చాలాకాలం తర్వాత ఆ కేంద్ర పథకాన్ని డబుల్ బెడ్రూం పథకంలో మెర్జ్ చేసుకున్నారు.
మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక..
రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోవడం వల్ల అనేక కేంద్ర పథకాలు తెలంగాణకు రాకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటులు జమ చేయడంతో అనేక పథకాలకు కేంద్ర నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, దేశ్ కీ నేత కావాలనుకుంటే పనులెలా జరుగుతాయి?
కొత్త సీఎం పాలనలో ప్రజలున్నారు
ఏ ముఖ్యమంత్రి అయినా తన వ్యక్తిగత మహత్వాకాంక్ష కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టరు! కానీ పదేండ్లలో తెలంగాణలో జరిగింది అది కాదనే సాహసం ఇపుడు ఎవరూ చేయలేకపోతున్నారు. పదేండ్లు స్వకార్యం తప్ప స్వామి కార్యం పట్టలేదు. అంతా తానే చేస్తున్నాననే హైహ్యాండెడ్నెస్ చాటుకునేందుకు, కేంద్రంతో అక్కరలేని ఘర్షణ డ్రామాలు నడిపి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను నిండా ముంచి పోయారు.
కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ నడుచుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో నడిపిన పుక్కిడి ఘర్షణ వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాలన్నీ రేవంత్‌రెడ్డికి తెలియనివి కావు. ఫలితంగానే, రాజకీయాలు ఎన్నికల కోసం అయితే, పరిపాలన ప్రజల కోసం అనే విషయం రేవంత్ రెడ్డి పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది.
ప్రజలకే ఎసరు పెట్టి, ఎవరూ ఎదగలేరు!
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఎన్ని బ్లేమ్గేమ్లు ఆడినా కేసీఆర్ దేశ్‌కీ నేత కాలేపోయారు. తెలంగాణ ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచే తప్పించారు. రాజకీయాల్లో దేశ్‌కీ నేతగా ఎవరు ఎదగాలనుకున్నా అది తప్పుకాదు. కానీ ప్రజల ప్రయోజనాలకు ఎసరు పెట్టి, బ్లేమ్గేమ్లను నమ్ముకొని ఎదగాలను కోవడమే తప్పు.
దేశ్‌కీ నేత కావాలని..
‘దేశ్ కీ నేత’ కావాలంటే, కేంద్రాన్ని కఠినంగా నిందించాలి. జాతీయపార్టీని స్థాపించాలి. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయానికి కేంద్రం నుంచి స్థలం సేకరించగలిగారు కానీ, రాష్ట్రానికి కావలసిన పనులను మాత్రం సాధించలేకపోవడమే గమనించాల్సిన విషయం! రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే హాజరు కాకపోవడం వల్ల దేశ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పెరుగుతుందనుకున్నారో ఏమో తెలియదు.
గవర్నర్ ను గౌరవించకపోతే, అనేక రాష్ట్రాల్లో ఉన్న పార్టీల దృష్టిలో గుర్తింపు పెరుగుతుందనే ఆలోచనా కావచ్చేమో? అడుగడుగునా పొలిటికల్ పబ్లిసిటీ ఆరాటంతో తెలంగాణ ప్రజలకు తీరని నష్టమే చేసిపెట్టాడు. చివరకు ఓ జాతీయ స్థాయి జర్నలిస్ట్‌తో.. తన నాయకత్వాన్ని దేశంలో ఏ పార్టీ అంగీకరించినా వారికి ఎన్నికల్లో ఫండింగ్ చేస్తానని చెప్పడం చూస్తే పైన చెప్పుకున్న విషయాలన్నీ నిజమే అనిపిస్తాయి.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్