గరీబోళ్ల గాథలు. . అంత్యక్రియలు చేయలేమంటూ తల్లి డెడ్‌బాడీని తీసుకెళ్లలే

  • గరీబోళ్ల గాథలు. .
  • నల్గొండ జిల్లాలో కొడుక్కు భారం కావొద్దని వృద్ధ దంపతుల ఆత్మహత్య
  • కామారెడ్డిలో తల్లి శవాన్ని తీసుకెళ్లేందుకు చేతిలో 
  • చిల్లిగవ్వ లేదని బిడ్డల అవస్థ
  • 2 రోజులుగా మార్చురీలోనే మృతదేహం
  • అంత్యక్రియలు చేయలేమంటూ తల్లి డెడ్‌బాడీని తీసుకెళ్లలే
  • తాము కడు పేదరికంలో ఉన్నామంటున్న బిడ్డలు

పేదరికం.. ఎంత భారమో చెప్పే రెండు హృదయ విదారక సంఘటనలివి. నల్గొండ జిల్లా అడ్లూరుకు చెందిన చిలుకూరి నర్సయ్య (75),  లక్ష్మమ్మ (70) దంపతులు. పక్షవాతంతో నాలుగేండ్లుగా నర్సయ్య మంచం పట్టిండు. లక్ష్మమ్మ డయాలసిస్ పేషెంట్. మందులు, గోలీలు, దవాఖాన ఖర్చుల కోసం నెలకే వేలకు వేలు ఖర్చు అవుతున్నదని, హైదరాబాద్​లో క్యాబ్​డ్రైవర్​గా పని చేస్తూ అంతంతగానే బతుకుతున్న  తమ కొడుక్కు భారం కావొద్దని ఆ దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.  ఆదివారం  పురుగుల మందు తాగి తనువు చాలించారు. ఇక, కామారెడ్డిలోని ఆర్​బీ నగర్‌‌‌‌కు చెందిన కడమంచి కిష్టవ్వ(70) తీవ్ర అనారోగ్యంతో శనివారం రాత్రి స్థానిక సర్కార్​ దవాఖాన్ల చనిపోయింది. విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది.. కిష్టవ్వ ఇద్దరు బిడ్డలకు చెప్పారు. తమ దగ్గర అంత్యక్రియలు చేసేంత స్థోమత లేదని, పూట గడుసుడే కష్టంగా ఉందని  ఆ బిడ్డలు తల్లి శవాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. 

కామారెడ్డి, వెలుగు: కని పెంచిన తల్లి అనారోగ్యంతో దవాఖానలో చనిపోతే డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు బిడ్డలు ససేమిరా అంటున్నారు. తాము కడు పేదరికంలో ఉన్నామని, తల్లి పేరుతో బ్యాంకులో ఉన్న పైసలు వస్తే తప్ప అంత్యక్రియలు చేయలేమని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​బీ నగర్‌‌కు చెందిన కడమంచి కిష్టవ్వ ( 70)కి ముగ్గురు కూతుళ్లు పెంటవ్వ, చంద్రవ్వ, ఎల్లవ్వ, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు, బిడ్డ చంద్రవ్వ చనిపోయారు. మిగతా ఇద్దరు బిడ్డలు పెంటవ్వ, ఎల్లవ్వ కడు పేదరికంలో జీవిస్తున్నారు. 

కిష్టవ్వ కూలినాలి చేసుకుంటూ లక్షా 70 వేలు కూడబెట్టి బ్యాంకులో వేసుకుంది. ప్రస్తుతం ఏ పనీ చేతకాక ఇరుగు పొరుగు వాళ్లు పెట్టింది తిని బతుకుతోంది. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఏప్రిల్​21న ఆమె కుటుంబసభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించారు. కిష్టవ్వ శనివారం రాత్రి చనిపోయింది. దీంతో హాస్పిటల్ సిబ్బంది.. కిష్టవ్వ బిడ్డలకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. దీంతో ఆదివారం డెడ్​బాడీని మార్చరీకి తరలించి ఫ్రీజర్‌‌లో  భద్రపరిచారు. పలుమార్లు హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు వారికి ఫోన్ చేశారు. తమకు అంత్యక్రియలు చేసేంత స్థోమత లేదని, బ్యాంకులో ఉన్న పైసలకు వేరే వ్యక్తిని నామినీగా పెట్టారని, ఆ పైసలు ఇప్పిస్తే శవాన్ని తీసుకెళ్తామని పెంటవ్వ, ఎల్లవ్వ చెప్పారు. ఆదివారం రాత్రి వరకు బిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ హాస్పిటల్​కు రాలేదు.

చేతిలో పైసల్లేకనే..

మా అవ్వ పేరు మీద బ్యాంక్​లో పైసలు ఉన్నయ్. ఓ చుట్టపామెను నామినీగా పెట్టింది. చావు చేసేంత స్థోమత కూడా మాకు లేదు. మాకు ఇల్లు లేదు, జాగలేదు. కూలినాలి చేసుకుంటూ పిల్లలతో కనాకష్టంగా బతుకుతున్నం. పైసలు ఇప్పిస్తే తెచ్చి కార్యక్రమం చేస్తం.
- పెంటవ్వ, ఎల్లవ్వ

  • కొడుక్కు భారం కావొద్దని వృద్ధ దంపతుల ఆత్మహత్య
  • నల్గొండ జిల్లా అడ్లూరులో విషాదం

శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు: అసలే పేదరి కం.. ఆపైన అనారోగ్యం.. ఒకరికి పక్షపాతం.. మ రొకరు డయాలసిస్ పేషెంట్.. కొడుక్కి భారం కావద్దని వృద్ధ దంపతులు తమ జీవితాన్ని ముగించుకు న్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి నర్సయ్య (75), లక్ష్మమ్మ (70) దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలున్నారు. కూతుళ్ల పెళ్లిళ్లయ్యాయి. కొడుకు క్యాబ్​డ్రైవర్​గా పని చేస్తూ భార్య పిల్లలతో  హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఊరి కి వచ్చి పోతుంటాడు. నర్సయ్య పక్షవాతంతో నాలుగేళ్లుగా మంచం పట్టాడు. లక్ష్మమ్మ డయాలసిస్ పేషెంట్ కావడంతో ట్రీట్​మెంట్‌కు ప్రతినెల వేలకు వేలు ఖర్చవుతోంది. 3నెలల కింద ఆమెకు సర్జరీ జరిగింది. తాము పిల్లలకు భారమవుతున్నామని, కొడుకు పరిస్థితే అంతంతమాత్రంగా ఉండడంతో అక్కడికి వెళ్లలేకపోతున్నామని దంపతులు ఎప్పుడూ బాధపడుతుండేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నమైనా ఇంటి నుంచి అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని శాలిగౌరారం పోలీసులు చెప్పారు.