పాత పంటల సంబురం.. జనవరి 14 నుంచి 29 రోజుల పాటు మిల్లెట్స్ జాతర

  • సంగారెడ్డి జిల్లాలో  వడ్డీ గ్రామంలో  వేడుకలు షురూ
  • ఎడ్ల బండ్లపై ఊరూరా పాత పంటల ప్రదర్శన
  • 25 ఏండ్ల వేడుకల్లో  డీడీఎస్ మహిళలు

సంగారెడ్డి, వెలుగు:  పాత పంటలంటే మొదట గుర్తొచ్చేది మిల్లెట్సే. ఆరోగ్యకరమైన మిల్లెట్స్ పై  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ లోని డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ (డీడీఎస్) విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏటా సంక్రాంతి సందర్భంగా నెల రోజులు ఎడ్లబండ్లపై ఊరూరు తిరుగుతూ డీడీఎస్ మహిళలు, రైతులు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంటారు. పాత పంటల జాతర మంగళవారం న్యాల్ కల్ మండలం వడ్డీ గ్రామంలో మొదలై ఫిబ్రవరి11న ఝరాసంఘం మండలం మాచునూరు డీడీఎస్ పచ్చశాలలో నిర్వహించే సభతో ముగుస్తుంది. ఈసారి 25 ఏండ్ల  జాతర కావడంతో సంబురాలు పెద్దఎత్తున చేపట్టారు.

అందరికీ పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో మిల్లెట్ల పంటలు,  సేంద్రియ సాగు, ఆకుకూరల ప్రయోజనాలపై డీడీఎస్ మహిళలు అవగాహన కల్పిస్తారు. పాత పంటల జాతర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు జాతర విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎడ్ల బండ్లను అందంగా అలంక రించి డప్పు చప్పుళ్ళు, గ్రామీణ నృత్యాలు, ఆటపాటలు, కోలాటాల ప్రదర్శనలతో ఊరూరా తిరుగు తారు. మట్టి కుండల్లో చిరుధాన్యాలను ఉంచి ప్రజలకు తెలియజేస్తూ ప్రదర్శన తీయడం ఏటా ఆనవాయితీ.  ప్రతి ఊరిలో మంగళహారతులతో స్వాగతించి ఎండ్లబండ్లకు పూజలు చేస్తారు. ఆ తర్వాత ఒకచోట కూర్చుని చిరుధాన్యాలపై వివరిస్తూ మిల్లెట్ పంటలు పండించే విధానంపై వీడియోలు ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తారు.

సాగులో లేని వాటిపై ప్రచారం

సాగులో లేని సుమారు 100 రకాల ఆకు కూరలు, 80 రకాల చిరుధాన్యాలపై డీడీఎస్ మహిళలు జాతరలో భాగంగా ప్రచారం చేస్తారు. రాగులు, కొర్రలు, అవిసెలు, జొన్నలు, సామలు, సజ్జలు వంటి మిల్లెట్లతో పాటు సాగులోని పంటలపైనా వివరిస్తారు. నేటి తరానికి తెలియని మరెన్నో పంటలను పరిచయం చేస్తారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై 24 ఏండ్ల కింద డీడీఎస్ మహిళలు వినూత్న తరహాలో ప్రచారం చేపట్టారు. చిరుధాన్యా లపై చెప్పడమే కాకుండా సాగు, వినియోగంపైనా మెలకువలు నేర్పిస్తున్నారు. పాత పంటల జాతరకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరై వివరాలు తెలుసుకొని అక్కడి ప్రజలకు చిరుధాన్యాలను పరిచయం చేస్తున్నారు.

సొంతంగా విత్తనాల తయారీ

దాదాపు 80 రకాల విత్తనాలను సొంతంగా తయారు చేస్తున్నారు.  ఆవు పేడతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. పాత కాలంలో వాడిన ఎరువులను పరిచయం చేస్తున్నారు. వాణిజ్య విత్తనాల మాదిరిగా కాకుండా సేంద్రియ విత్తనాలను మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. ఆకుకూరల్లో తెల్ల గవ్వల కూర, ఉత్తరేణి, జొన్న చెంచలి, పొనగంటి కూర, తాలేల్ల ఆకుకూర, సన్న పాయల కూర, ఎలక చెవిన కూరలు ఇలా మరెన్నో పోషకాలతో కూడిన ఆకుకూరల విత్తనాలను కూడా తయారు చేస్తున్నారు.

వానాకాలం సీజన్ లో ఆకు కూరల జాతర నిర్వహించి వాటిని వండి వన భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం, జీవ వైవిధ్య పంటలపైనా ప్రచారం చేయడం పాత పంటల జాతర ముఖ్యోద్దేశం కూడా. దీంతో డీడీఎస్ మహిళల భాగస్వామ్యం మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఆరోగ్య సమాజమే లక్ష్యం 

 ప్రస్తుత ఆహారపు అలవాట్లతో జనాల్లో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. అందుకే ఆరోగ్యకరమైన పంటలను అందించాలనే మా లక్ష్యం.  ప్రతి ఏటా జాతర చేస్తున్నాం. చిరుధాన్యాలపై చెప్తూ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా మనం తినే ఆహారం అలవాట్లు మారాలి. మార్కెట్లో ప్రతిచోట మిల్లెట్స్ దొరుకుతున్నాయి. కొనుగోళ్లు కూడా పెరిగాయి. - జడల చంద్రమ్మ, డీడీఎస్ సభ్యురాలు, బిడకన్నె, సంగారెడ్డి జిల్లా

ప్రభుత్వం ప్రోత్సహించాలి

డీడీఎస్ సహకారంతో ప్రజల్లోకి పాత పంటలను తీసుకుపోతున్నాం. విత్తనాల మొదలు మార్కెటింగ్ వరకు డీడీఎస్ అందిస్తోన్న సహకారం మరువలేనిది. మా సేవలు ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. చిరుధాన్యాలను నిల్వ చేసేందుకు బ్యాంకులు కూడా ఏర్పాటు చేసుకున్నాం.  నగరాలకు కూడా చేరాలన్నదే మా లక్ష్యం. అందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం.  - సూర్యకళ, డీడీఎస్ సభ్యురాలు, మెటల్ కుంట, సంగారెడ్డి జిల్లా