రేట్లు పెరిగె.. చార్జీలు పెరగకపాయే.. హాస్టళ్లలో ‘మెనూ’ కష్టాలు

  • ఆకాశాన్నంటుతున్న అన్ని వస్తువుల ధరలు
  • ఏ మాత్రం సరిపోవడం లేదంటున్న వార్డెన్లు 

సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలు పెంచుతామని మూడు నెలల కింద సర్కారు ప్రకటించినా ఇప్పటికీ ఎలాంటి ఆర్డర్స్​ రాలేదు. దీంతో పాత డైట్​ చార్జీలే కొనసాగుతున్నాయి. అన్ని ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మెనూ అమలు భారంగా మారిందని వార్డెన్లు వాపోతున్నారు. సూర్యాపేట జిల్లాలో 39 ఎస్సీ, 21 ఎస్టీ, 8 బీసీ, 4 మైనార్టీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 11,152 మంది స్టూడెంట్స్​ ఉంటున్నారు.  వీరిలో 3 నుంచి 7వ తరగతి చదివే స్టూడెంట్స్ కు ఒక్కోక్కరికి నెలకు  రూ.950, 8 నుంచి10వ తరగతి వరకు రూ. 1100, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు రూ.1500 ప్రభుత్వం చెల్లిస్తోంది. 

కొత్త మెనూ అమలు ఎలా? 

మార్కెట్లోని  అన్ని వస్తువుల ధరలు పెరగడంతో ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఎలా అమలు చేయాలని హాస్టళ్ల వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని తాకడంతో ఏది కొనే పరిస్థితి లేదు.  చికెన్ కిలో దాదాపు రూ. 250కి పైనే ఉంది. కిలో పప్పు  రూ. 120వరకు ఉంది. ఇక కూరగాయలు సైతం కిలో వంద వరకు పలుకుతున్నాయి. పాల ధరలు సైతం పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కొత్త మెనూలో వారంలో రెండు సార్లు చికెన్, నాలుగుసార్లు గుడ్లు పెట్టాల్సి ఉంది. మహాత్మా జ్యోతిభా ఫూలే హాస్టళ్లలో అదనంగా నెలలో ఒకసారి మటన్ తో భోజనం పెట్టాల్సి ఉంటుంది. రోజూ ఉదయం రాగి జావా ఇవ్వాలని కూడా మెనూలో చేర్చారు. వీటిని అమలు చేయాలంటే ప్రభుత్వం ఇచ్చే పాత డైట్ చార్జీలు ఏ మాత్రం సరిపోవడం లేదని వార్డెన్లు చెబుతున్నారు.

అప్పులు తేవాల్సిన పరిస్థితి.. 

కొత్తగా డైట్ చార్జీలను రూ.300 పెంచుతున్నట్లు మూడు నెలల కింద క్యాబినెట్ లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటి వరకు పెంచిన డైట్ చార్జీలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాకపోవడంతో కొన్ని చోట్ల పాత మెనూనే అష్టకష్టాలతో నెట్టుకొస్తుంటే, మరికొన్ని చోట్ల అప్పులు తెచ్చి కొత్త మెనూ అమలు చేయాల్సి వస్తోందని వార్డెన్లు చెబుతున్నారు. కొత్త మెనూ అమలు చేయాలంటే ఒక్కో స్టూడెంట్ కు రూ.2వేల వరకు డైట్ చార్జీలను పెంచితేగాని సరిపోయే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.

మెనూ అమలు చేయాల్సిందే 

ప్రస్తుతం కూరగాయల ధరలు పెరిగిన మాట వాస్తవమే. దీనిపై ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెనూను వార్డెన్లు అమలు చేయాల్సిందే . మా చేతుల్లో ఏమీ లేదు. గతంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. 
–  దయానంద రాణి, డీడీ, ఎస్సీ, వెల్ఫేర్,  సూర్యాపేట