- మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోనే ముందుకు
- కొత్త వందే భారత్, వందే మెట్రో రైళ్లపై నిరాశ
- వృద్ధులకు టికెట్లపై రాయితీ ప్రకటించని కేంద్రం
- మధ్యంతర బడ్జెట్లో రూ.2.52 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: రైల్వే శాఖకు బడ్జెట్లో మరికొన్ని నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ఫండ్స్ కేటాయించలేదు. మరిన్ని వందే భారత్ ట్రైన్లు, వందే మెట్రో, ఎలక్ట్రిఫికేషన్‌తో పాటు కొత్త రూట్లకు ప్రాధాన్యత ఇస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. అదేవిధంగా, వృద్ధులు, జర్నలిస్టులకు టికెట్లపై రాయితీ ఇస్తారని అనుకున్నారు.
కానీ.. వీటిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ సిస్టమ్ మెరుగుపర్చేందుకు నిధులు అలాట్ చేస్తారని భావించినా.. అలాంటి అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. మధ్యంతర బడ్జెట్లోని కేటాయింపులే 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఉంటాయని ఆమె తెలిపారు. ముంబై – అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్, నమో భారత్ పై కీలక ప్రకటన ఉంటుందని అనుకున్నారు.
కానీ.. నిర్మలా సీతారామన్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మధ్యంతర బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2,52,200 కోట్లు కేటాయించారు. పూర్తి స్థాయి బడ్జెట్లో మరో రూ.10వేల కోట్ల వరకు అదనంగా చేరుస్తారని భావించినా నిరాశే ఎదురైంది. ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్‌తో సహా మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్‌లు ఇండియాలో వస్తాయని మాత్రమే నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించారు.
పడిపోయిన రైల్వే స్టాక్స్
రైల్వే శాఖకు ఎలాంటి నిధులు కేటాయించ డం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయగానే.. రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) 6%, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) 5.6%, ఐర్కాన్ ఇంటర్నేషనల్, రెయిల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 9%, ఐఆర్సీటీసీ 3.14%, టెక్స్మెకో రైల్ అండ్ ఇంజినీరింగ్ స్టాక్స్ 4%, ఎన్బీసీసీ ఇండియా 7 %, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 6.6 % వరకు పడిపోయాయి. ప్రతీ స్టాక్ 1 నుంచి 6 % వరకు పడిపోయాయి.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి న మధ్యంతర బడ్జెట్‌కు ముందు రైల్వే స్టాక్‌లన్నీ 11 % నుంచి 112 % వరకు రిటర్న్స్ ఇచ్చాయి. వీటిలో ఆర్వీఎన్ఎల్ 112 % రిటర్న్స్‌తో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తరువాత ఐర్కాన్ ఇంటర్నేషనల్ 44 %, రైల్ టెల్ 37 %, టెక్స్మెకో రైల్ 31 %, ఐఆర్ఎఫ్సీ 28 %, ఎన్బీసీసీ 12 % లాభాలు ఇచ్చాయి.