ఇంటి నుంచి వెళ్లిపోవాలన్న కొడుకు, కోడలు..ఉరి వేసుకొని వృద్ధుడు సూసైడ్‌‌‌‌

ఇంటి నుంచి వెళ్లిపోవాలన్న కొడుకు, కోడలు..ఉరి వేసుకొని వృద్ధుడు సూసైడ్‌‌‌‌
  • పెద్దపల్లి జిల్లా మియాపూర్‌‌‌‌లో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని కొడుకు, కోడలు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌‌‌ మండలం మియాపూర్‌‌‌‌ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గండి వీరేశం(68), సుగుణ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉండగా అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. గ్రామంలోనే ఉంటున్న పెద్దకొడుకు సదయ్య ఇంట్లోని ఓ గదిలో వీరేశం, సుగుణ ఉంటున్నారు. అయితే తమ ఇంట్లోంచి వెళ్లిపోవాలని సదయ్య, అతడి భార్య సుజాత కొన్ని రోజులుగా వృద్ధ దంపతులను వేధిస్తున్నారు. 

దీంతో సుగుణ బంధువుల ఇంటికి వెళ్లిపోగా, వీరేశం ఈ నెల 6 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో రెండో కొడుకు రాజు ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌‌‌‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని తాటి వనంలో ఓ చెట్టుకు వృద్ధుడు ఉరి వేసుకొని కనిపించడంతో వీరేశంగా గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

వీరేశం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజే ఉరి వేసుకొని ఉంటాడని తెలుస్తోంది. తన భర్త ఆత్మహత్యకు కొడుకు సదయ్య, కోడలు సుజాతే కారణమని వీరేశం భార్య సుగుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.