నా కొడుకు ఆస్తి లాక్కొని గెంటేసిండు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి

  • అతనిపై చర్యలు తీసుకుని భూమిని తిరిగి ఇప్పించండి
  • వర్ధన్నపేట పోలీసులు, అధికారులకు వృద్ధుడి ఫిర్యాదు

వర్ధన్నపేట, వెలుగు: కొడుకు ఆస్తినంతా లాక్కొని ఇంట్లోంచి వెళ్లగొట్టిండని ఓ తండ్రి పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశాడు.   బాధితుడు తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారు దొడ్లగడ్డ గ్రామానికి చెందిన గుజ్జుల రాజిరెడ్డికి ఇద్దరు భార్యలు. కాగా.. మొదటి భార్యకు ఒక కొడుకు, కూతురు,  రెండో భార్యకు కూతురు జన్మించారు. కొన్నేండ్లుగా వృద్ధుడైన తండ్రిపై కొడుకు వినయ్ రెడ్డి వారసత్వంగా వచ్చిన15 ఎకరాల భూమిని తన పేరిట రాయాలని ఒత్తిడి చేశాడు. లేదంటే రెండో భార్యను, ఆమె కూతురిని చంపుతానని బెదిరించాడు. దీంతో నాలుగేండ్ల కింద కొడుకుపేరిట భూమిని తండ్రి రిజిస్ట్రే షన్ చేసి ఇచ్చాడు. అనంతరం  నానమ్మ, తండ్రి, రెండో భార్య, ఆమె కూతురుని 2022లో ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టాడు. రెండు నెలల కింద నానమ్మ చనిపోతే శవాన్ని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. పెద్దమనుషులు జోక్యం చేసుకొని అంత్యక్రియలు పూర్తి చేయించారు. దీంతో విసిగిపోయిన రాజిరెడ్డి గురువారం కొడుకుపై వర్ధన్నపేట పోలీసులకు, తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల్లో కంప్లయింట్ చేశాడు. కొడుకు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. భూమిని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు.