కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కిష్టయ్య(70) కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అంజన్న దర్శనానికి వచ్చాడు. కోనేరులో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు డెడ్ బాడీని వాహనంలో ఆయన స్వగ్రామానికి తరలించారు.
రాములవారి దర్శనానికి వచ్చి గోదావరిలో మునిగి..
భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద ఆదివారం ఓ భక్తుడు నీటిలో మునిగి చనిపోయాడు. ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పి.గన్నవరం మండలం రాజులపాలెం గ్రామానికి చెందిన రాయుడు రామకృష్ణ(40) కుటుంబ సభ్యులతో కలిసి రాములవారి దర్శనం కోసం వచ్చాడు. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన రామకృష్ణ లోతు తెలియక మునిగిపోయాడు. స్థానికులు వెళ్లేసరికే నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు.