యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో అర్చకులు ఆయనకు స్వాగతం, వేదాశీర్వచనం నిర్వహించలేదు. దీంతో మంత్రి సువర్ణ పుష్పార్చన టికెట్ కొనుగోలు చేసి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాంటేకార్ పవన్ ఉన్నారు. మరోవైపు ఆలయంలో స్వామివారికి నిత్యపూజలు వైభవంగా కొనసాగాయి. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా సోమవారం ఆలయానికి రూ.51,13,569 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు.
వేములకొండను మండలం చేయాలి
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వేములకొండను మండలం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం వేములకొండతో పాటు, 8 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు యాదాద్రి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా
పలువురు మాట్లాడుతూ వేములకొండను మండలం చేయాలని 80 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదన్నారు. కలెక్టరేట్ మెయిన్ గేటు వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడే సుమారు రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. అనంతరం వినతిపత్రం ఇవ్వడానికి ఐదుగురికి పర్మిషన్ ఇవ్వడంతో వారు కలెక్టరేట్ ఏవో నాగేశ్వరాచారికి వినతిపత్రం అందజేశారు.
రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌కు వెళ్లిన లీడర్లు
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు బీజేపీ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి చౌటుప్పల్ నుంచి లీడర్లు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం నుంచి చండూరు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు దాసోజు భిక్షమాచారి, కౌన్సిలర్ మల్లేశం, పిల్ల బుచ్చయ్య, ఐలయ్య, రంగయ్య, దుర్గయ్య, లింగస్వామి, నరసింహ, ఎర్ర గణేశ్, రంజిత్, శ్రీను పాల్గొన్నారు.
గిరిజనుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం
హుజూర్‌నగర్, వెలుగు : గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బీల్యానాయక్‌తండాకు చెందిన ధరావత్ నవీన్ నాయక్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గిరిజనులు, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తోందన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తామన్నారు.
సెలవుపై వెళ్లిన యాదాద్రి కలెక్టర్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఈ నెల 15 వరకు సెలవు తీసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.
సాగర్ ఎడమ కాల్వకు త్వరలో రిపేర్లు చేస్తం
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో డ్యామేజీ అయిన చోట్ల వానాకాలం సీజన్ పూర్తయ్యాక రిపేర్లు చేస్తామని ఇరిగేషన్ మిర్యాలగూడ డివిజన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.లక్ష్మణ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాలియా సమీపంలో 16.400 కిలోమీటర్ వద్ద కాల్వ మట్టి జారి సుమారు 60 మీటర్ల మేర లైనింగ్ దెబ్బతినడంతో ఇసుక బస్తాలతో తాత్కాలిక రిపేర్లు చేశామన్నారు. ఎడమ కాల్వ వెంట ఆఫీసర్లు నిరంతరం గస్తీ తిరుగుతూ లీకేజీ ప్రాంతాలను గుర్తిస్తున్నారన్నారు. ఎడమ కాల్వ రిపేర్లు, నీటి విడుదల పట్ల రైతులు ఆందోళన చెందొద్దన్నారు.
ఆంధోల్ మైసమ్మ ఆలయంలో కూసుకుంట్ల పూజలు
చౌటుప్పల్, వెలుగు : మునుగోడు టీఆర్‌ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని ఆంధోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే మునుగోడు అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, ఎలువర్తి యాదగిరి, వెంకటేశ్ యాదవ్, చింతల దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
మూసీలో దొరికిన మహిళ డెడ్‌బాడీ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం పరిధిలో గల మూసీ నదిలో సోమవారం గుర్తు తెలియని మహిళ (35) మృతదేహం దొరికింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న వలిగొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని రామన్నపేట సీహెచ్‌ఎస్‌కు తరలించారు. మహిళ చనిపోయి సుమారు 10 రోజులు కావొచ్చని ఎస్సై ప్రభాకర్ తెలిపారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక ఆత్మహత్య ? హత్యా ? అన్నది తేలుతుందని చెప్పారు.
గ్రామాలను ప్రభుత్వం పట్టించుకుంటలే..
యాదాద్రి, వెలుగు : గ్రామీణ ప్రాంతాలు, కుల వృత్తులను సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య విమర్శించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో గౌడ సంఘం భవన నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, కులవృత్తులను పరిరక్షిస్తేనే ఉపాధి దొరుకుతుందన్నారు. గౌడ సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ అశోక్, కాంగ్రెస్ అధ్యక్షుడు వెంటేశ్వర రాజు, గౌడ సంఘం అధ్యక్షుడు రమేశ్, విజేందర్‌రెడ్డి, ప్రవీణ్ ఉన్నారు.
తహసీల్దార్ ఆఫీస్‌లను ముట్టడించిన వీఆర్‌ఏలు
యాదాద్రి/యాదగిరిగుట్ట/కోదాడ/హుజూర్‌నగర్/తుంగతుర్తి, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏలు సోమవారం తహసీల్దార్ ఆఫీసులను ముట్టడించారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరి, యాదగిరిగుట్ట, సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తిలో తహసీల్దార్ ఆఫీసుల గేట్లకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అర్హత గల వీఆర్‌ఏలకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు, 55 ఏళ్లు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 78 రోజులుగా సమ్మెచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి
తుంగతుర్తి, వెలుగు : డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం అభివృ-ద్ధి చెందుతుందని బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య చెప్పారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పలువురు సోమవారం ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ కుంట దయాకర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వీరికి రామచంద్రయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులిస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. మునుగోడులో బీజేపీ విజయం ఖామయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ కన్వీనర్ కాప రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండల అధ్యక్షుడు గాజుల మహేందర్, మద్దిరాల మండల అధ్యక్షుడు భూతం సాగర్, అంబటి కృష్ణ పాల్గొన్నారు.
భూ ఆక్రమణదారులపై స్థానికుల దాడి
సూర్యాపేట, వెలుగు : తమ గ్రామానికి చెందిన భూములను ఆక్రమిస్తున్న వారిపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కుడకుడ గ్రామంలోని 126 సర్వే నంబర్‌లో కొంత ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొందరు లీడర్లు ఆక్రమించినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట పక్క మండలాలకు చెందిన పలువురు వ్యక్తులు ఆ భూమిలో పెద్ద ఎత్తున గుడిసెలు వేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. సోమవారం కుడకుడ గ్రామస్తులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆక్రమణదారులను ఖాళీ చేయించారు. ఈ దాడుల్లో కొందరు వ్యక్తులు గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
16న ఆహార భద్రతా దినోత్సవం జరపాలి
నల్గొండ అర్బన్, వెలుగు : మధ్యాహ్నం భోజనం అందిస్తున్న నల్గొండ జిల్లాలోని అన్ని స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ నెల 16న ఆహార భద్రతా దినోత్సవం నిర్వహించాలని డీఈవో బొల్లారం భిక్షపతి ఆదేశించారు. ఇందులో భాగంగా స్కూల్, మండల వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయికి పంపించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకం మెనూ పాటించాలని, స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్, ఎగ్, చికెన్ అందజేయాలన్నారు.
కొనసాగుతున్న నీటి విడుదల
హాలియా/మేళ్లచెరువు, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,50,366 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 12 గేట్లను ఎత్తి 96,696 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 589.60 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడికాల్వకు 8,144 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6,634, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరదకాల్వకు 400, పవర్ హౌజ్‌కు 33,779 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు 1.18 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఐదు గేట్ల ద్వారా 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర
యాదగిరిగుట్ట, వెలుగు : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లికి చెందిన పలువురు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు పొలగోని వెంకటేశ్‌గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్యనారాయణ, పీఏసీఎస్ డైరెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పేరుతో డ్రామా
యాదగిరిగుట్ట, వెలుగు : తెలంగాణలో తన ఆటలు సాగవని గమనించిన కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు పడాల శ్రీనివాస్ విమర్శించారు. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌కు త్వరలో వీఆర్ఎస్ తప్పదన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్, చిన్నలక్ష్మాపూర్, బద్దుతండా, ధర్మారం గ్రామాలకు చెందిన పలువురు సోమవారం పడాల సమక్షంలో బీజేపీలో చేరారు. మండల ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుండెబోయిన మల్లేశ్, జిల్లా అధికార ప్రతినిధి డొంకెన రాజుగౌడ్, రమేశ్‌యాదవ్, నరేందర్ నాయక్ పాల్గొన్నారు.