కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల రాస్తారోకో 

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా పాత రాజంపేట రైతులు ఆందోళన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ లో తమ భూములను గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ లో చూపుతున్నారంటూ రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి.. రైతులు ఆందోళన విరమించేలా చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన రైతులు..తమ భూములను ఇండస్ట్రియల్ జోన్ లో నుంచి తొలగించాలని కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 

మాస్టర్​ప్లాన్​పై నిరసనలు ఎందుకంటే..

కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్​ ప్లాన్ ప్రపోజల్స్​పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్​, అడ్లూర్​ఎల్లారెడ్డి,  టెకిర్యాల్​, ఇల్చిపూర్​, దేవునిపల్లి, లింగాపూర్​, సరంపల్లి,  పాతరాజంపేట, రామేశ్వర్​పల్లి  కలుపుకొని  61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ మాస్టర్​ ప్లాన్​రూపొందించింది. దీనిపై డ్రాఫ్ట్ ​రిలీజ్​ చేసిన అధికారులు  2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు.  

ప్లాన్​లో  ఇక్కడ  8.5 శాతం ఏరియా  1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రీయల్​ కింద  ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్​ హైవే పక్కన..  టౌన్​ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పచ్చని పంటలు పండే అడ్లూర్​, ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి గ్రామాలకు చెందిన భూములు ఉండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్​ జోన్​లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్​ రాదని,  నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని, ఫలితంగా భూముల విలువ తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎవరినీ సంప్రదించకుండా.. తమకు చెప్పకుండా మాస్టర్​ ప్లాన్​ ఎలా తయారు చేస్తారంటూ  రైతులు నిలదీస్తున్నారు.  100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన మీదా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లింగాపూర్​, దేవునిపల్లి, అడ్లూర్​,  ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు.