మధిరలో మళ్లీ వాళ్లే ప్రత్యర్థులు..!

  • మధిరలో భట్టి విక్రమార్క  వర్సెస్​ కమల్​ రాజ్​ 
  • నాలుగోసారి విజయంపై సీఎల్పీ నేత నజర్​ 
  • వరుసగా మూడుసార్లు ఓడి రివేంజ్​ కోసం చూస్తున్న లింగాల

ఖమ్మం, వెలుగు: మధిర నియోజకవర్గంలో నాలుగోసారి కూడా పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్​ కొట్టిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  నాలుగోసారి కాంగ్రెస్​ అభ్యర్థిగా  బరిలోకి దిగుతున్నారు. ఆయనపై వరుసగా మూడుసార్లు ఓడిపోయిన లింగాల కమల్ రాజ్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. 2009, 2014లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, గత ఎన్నికల్లో బీఆర్ఎస్​అభ్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. మరోసారి కమల్​రాజ్​ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

భట్టికి సీఎం ప్రచారం కలిసొచ్చేనా..!

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే వరుసగా మూడుసార్లు మధిర నుంచి విజయం సాధించి హ్యాట్రిక్​ కొట్టారు. 2018లో  ఎన్నికైన తర్వాత సీఎల్పీ నేతగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి  రావచ్చునని ప్రచారం జరుగుతోంది. సీఎం చాన్స్​ ఉందంటూ పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భట్టి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.

ఈసారి కాంగ్రెస్​కు మెజార్టీ స్థానాలు వస్తే దళితనేతగా భట్టి  సీఎం రేసులో  ఉంటారంటూ ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.  కాంగ్రెస్​ గెలిస్తే భట్టి సీఎం అయ్యే అవకాశం ఉందన్న మౌత్​ పబ్లిసిటీ పెరగడం ఆయనకు పాజిటివ్ గా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇది ఎమ్మెల్యేగా ఆయన గెలుపుపై  ప్రభావాన్ని చూపిస్తుందనే అంచనాలున్నాయి. అయితే వరుసగా మూడుసార్లు గెలవడం వల్ల కొంత వ్యతిరేకత ఉండడం, స్థానికంగా అందుబాటులో ఉండరనే ప్రచారం ఆయనకు కొంత మైనస్​ గా మారే ఛాన్సుంది. 

పథకాలు, సానుభూతే లింగాలకు అండ..!

వరుసగా మూడుసార్లు ఓడినప్పటికీ కమల్​రాజ్ మళ్లీ కారు గుర్తుపై  పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జడ్పీ చైర్మన్​ గా ఎన్నికయ్యారు. దీంతో నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున నిధులు తెస్తూ, మరింత పట్టు పెంచుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు కింద నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తే, అందులో చింతకాని మండలం ఉండడం, 4 వేల మంది దళిత కుటుంబాలకు లబ్ది జరగడంతో ఆయనకు సానుకూలంగా మారింది.

ఇటీవల బోనకల్ ​మండలాన్ని కూడా దళితబంధు కింద ఎంపిక చేసినప్పటికీ స్కీమ్​ పూర్తిస్థాయిలో అమలు కాకుండానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వరుసగా ఓడిపోవడంతో సానుభూతి కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3,500 ఓట్ల తేడాతోనే ఓడడంతో ఈసారి తప్పకుండా గెలిచి తీరతాననే ధీమాతో  కనిపిస్తున్నారు. 

సీపీఎం ఓట్లూ కీలకమే..!

నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్​ బలంగా ఉన్నప్పటికీ సీపీఎంకు కూడా కేడర్​ ఉంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల పొత్తు ఉంటుందని ప్రచారం ఉండడంతో అది కాంగ్రెస్​కు అదనపు బలంగా మారుతుందని అంచనాలున్నాయి. ఇప్పుడు బ్రేకప్​ అయ్యే అవకాశం కనిపిస్తుండడం భట్టికి కొంత ఇబ్బందికరంగా మారే ఛాన్సుంది. గతంలో ఐదుసార్లు మధిర నుంచి సీపీఎం అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇప్పటికీ సొంతంగా గెలిచే బలం లేకపోయినా, ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సీపీఎంకు ఓటు బ్యాంకు ఉంది. దీంతో సీపీఎం నిర్ణయంపైనా ఆసక్తి నెలకొంది.