రెచ్చిపోయిన పిచ్చికుక్కలు.. వృద్ధురాలు మృతి

రెచ్చిపోయిన పిచ్చికుక్కలు.. వృద్ధురాలు మృతి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు చనిపోయింది.   ముస్తాబాద్​రామవ్వ(75) బుధవారం సాయంత్రం తన ఇంటి ముందు ఒంటరిగా కూర్చొంది. ఈ ప్రాంతంలో ఉన్న కుక్కలు ఆమెపై దాడి చేసి..లాకెళ్లే ప్రయత్నం చేశాయి. ఆమె చేతులు,ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పరిగెత్తుకు వచ్చి కుక్కలను తరిమేశారు. వృద్ధురాలిని ట్రీట్​మెంట్​కోసం కామారెడ్డి జిల్లా హాస్పిటల్​కు తరలించారు.  పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.  

ఐదేండ్ల బాలుడిపై దాడి  

జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని మల్కపేటలో ఐదేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి.  బోనోతు హుసేన్​,చంద్రకళ కొడుకు బిజన్​(5) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కల గుంపు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడడంతో గమనించిన తల్లిదండ్రులు జనగామ ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్​తీసుకువెళ్లారు. జనగామలో ఉండే బిజన్​కుటుంబం ఇటీవలే పనిపై సొంతూరైన మల్కపేటకు 
వచ్చారు.

కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై దాడి

కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో దళిత మహిళతో పాటు ఆమెతో కలిసి ఉంటున్న వ్యక్తిపై మొదటి భార్య తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది వరకే పెండ్లయిన ఓ యువకుడు 3 నెలల నుంచి మరో యువతితో కలిసి ఉంటున్నాడు. దీంతో యువకుడి మొదటి భార్య బంధువులు ఈ నెల 4న వీరిద్దరి ఊరికి వెళ్లి చితకబాదారు. ఐదు రోజుల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.