శివ్వంపేట, వెలుగు: నడవ లేని స్థితిలో ఓ వృద్ధురాలు 15 రోజులుగా శివ్వంపేట మండల పరిధిలోని ఉసిరికపల్లి చౌరస్తా వద్ద తిరుగుతోంది. రోడ్డు మీద వెళ్లే వారు ఆమె దయనీయ పరిస్థితి చూసి ఏదైనా పెడితే తింటోంది. ఏ ఊరు, ఏం పేరు అని అడిగితే లక్ష్మమ్మ అని చెబుతుంది. గ్రామం పేరు చెప్పడం లేదు. తనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని, గంజి పోయలేక వదిలిపెట్టి పోయారని చెబుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి వణుకుతూ ఇబ్బంది పడుతోంది.
ఆకలవుతుంది అన్నం పెట్టండని దీనంగా అడుగుతుండడంతో పక్కనే పొలాల వద్ద వ్యవసాయ పనికి వచ్చిన కూలీలు అన్నం పెట్టి, తొడుక్కునేందుకు ఒక షర్టు ఇచ్చారు. ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో కానీ అనాధాశ్రమంలో కానీ చేర్పించాలని స్థానికులు కోరుతున్నారు.