- ఖమ్మం జిల్లా తల్లాడలో ఘటన
తల్లాడ, వెలుగు: గొంతులో గారే ఇరుక్కుని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తల్లాడ మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు మొక్కా తిరుపతమ్మ (80) తన పెద్ద కొడుకు వద్ద ఉంటుంది. కాగా.. సంక్రాంతి సందర్భంగా ఆమె రెండో కొడుకు ఇంట్లో చేసిన పిండి వంటలు, గారెలను తినేందుకు తల్లికి పంపించాడు. గురువారం వృద్ధురాలు తిరుపతమ్మ గారెలు తింటుండగా ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందింది. మృతురాలి కూతురు కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు.