సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట లో సోమవారం కోతుల దాడిలో ఓ వృద్ధురాలు చనిపోయింది. గ్రామానికి చెందిన మెట్టు లింగమ్మ(80) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఒక రూమ్ లో ఉంటున్నది. ఆదివారం ఇంట్లో వారంతా బతుకమ్మ ఆడడానికి వెళ్లగా కోతుల గుంపు వచ్చింది. పడుకున్న లింగమ్మ పై దాడి చేయగా అక్కడికక్కడే మరణించింది.
కోతులు రాకుండా తీగలు..కరెంట్ షాక్ తో బాలుడు మృతి
నెల్లికుదురు(కేసముద్రం) : మహబూబాబాద్ జిల్లాలో కోతులు రాకుండా ఏర్పాటు చేసిన కరెంట్ తీగల కంచె ఓ బాలుడి ప్రాణం తీసింది. కేసముద్రం మండలం మర్రి తండాకు చెందిన వాంకుడోతు జీవన్(15) సోమవారం దోస్తులతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లాడు. వాంకుడోతు బిచ్చు అనే వ్యక్తి తన పంట చుట్టూ ఇనుప కంచె వేసి, కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. దానిని తాకిన జీవన్ షాక్ కొట్టి చనిపోయాడు. తోటి స్నేహితులు గ్రామస్తులకు చెప్పడంతో కుటుంబసభ్యులు డెడ్ బాడీతో బిచ్చు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు.
కోతుల బెడద అరికట్టాలని ట్యాంకు ఎక్కిన్రు
చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని రావికంపాడులో కోతుల బెడద అరికట్టాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. పంచాయితీ ఆఫీసు గేట్ కు తాళం వేసి బైఠాయించారు. మరికొందరు గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కారు. గ్రామంలో ఇటీవల ఇంట్లో పడుకున్న వృద్ధులు, కిరాణ, కూరగాయలకు వెళ్లే మహిళలు, స్కూల్ కు వెళ్ళే స్టూడెంట్స్పై కోతులు దాడి చేస్తున్నాయన్నారు. పంచాయితీ ఆధ్వర్యంలో కోతులను పట్టించి అడవుల్లో వదిలేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్ఐ విజయలక్ష్మి అక్కడికి వచ్చి మాట్లాడారు. కోతులను పట్టిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. దీంతో ఎస్ఐ సమక్షంలో సర్పంచ్రన్యా, దేవాలయ కమిటీ సభ్యులు కోతులను పట్టిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.