నా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన

నా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన
  • న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత

తొర్రూరు, వెలుగు: నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదు. ఇబ్బందులు పెడుతుండు. నా రెండెకరాల భూమిని అమ్ముకుండు. ఆ భూమి పట్టాను రద్దు చేసి నా పేరిట ఎక్కించి న్యాయం చేయండి..” అంటూ వృద్ధురాలు ఆర్డీవోకు వినతిపత్రం అందించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన యెల్ది రంగయ్య, సుశీల దంపతులు ఇద్దరు కొడుకులు, కుమార్తెకు పెండ్లి చేశారు. భార్యాభర్తలు సంపాదించిన 18 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చారు. ఏడేండ్ల కింద రంగయ్య చనిపోయాడు. సుశీల వాటాకు వచ్చిన భూమితో పాటు మరో రెండున్నర ఎకరాలను ప్రభుత్వ ఉద్యోగి అయిన చిన్న కొడుకు రమేష్ అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. 

దీనిపై అతడిని నిలదీయడంతో తల్లితో పాటు సోదరుడు వెంకన్నను బెదిరించాడు. అనంతరం తల్లి సంరక్షణను పట్టించుకోవడం మానేశాడు. ఇటీవల రెండున్నర ఎకరాలను అమ్ముకోవడంతో  సుశీల కలెక్టర్ కు , సీసీఎల్ఏ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. తనను పట్టించుకోకుండా చిన్న కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడని, వృద్ధురాలు సోమవారం తొర్రూర్ ఆర్డీవోను కలిసింది.  అక్రమంగా పట్టా చేయించుకున్న భూమిని రద్దు చేయాలని కోరగా న్యాయం జరిగేలా చూస్తానని ఆమెకు హామీనిచ్చారు.