వీళ్లు మనుషులేనా.?.. కడ చూపుకైనా రాని కన్నబిడ్డలు

వీళ్లు మనుషులేనా.?.. కడ చూపుకైనా రాని కన్నబిడ్డలు
  • అనారోగ్యంతో వృద్ధురాలు మృతి
  • ఆశ్రమ నిర్వాహకుడే అంత్యక్రియలు పూర్తి
  • కరీంనగర్ జిల్లా వెలిచాలలో ఘటన

రామడుగు, వెలుగు : కన్న బిడ్డలున్నా కడసారి చూపునకు నోచుకోలేదు వృద్ధురాలు దుర్గమ్మ.  అనాథాశ్రమ నిర్వాహకుడే ఆమె అంత్యక్రియలు పూర్తి చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన దుర్గమ్మకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆమె భర్త, కొడుకు కొన్నేండ్ల కింద అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా బతుకుతుండగా.. వృద్ధాప్యంలోనూ తల్లిని కూతుళ్లు చేరదీయలేదు. కూలీ చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో చివరకు రామడుగు పోలీసులను ఆశ్రయించింది. కూతుళ్లు, కోడలితో మాట్లాడినా తమకేం సంబంధం లేదన్నట్లుగా పట్టించుకోలేదు. 

దీంతో వెలిచాల శివారులోని స్పందన అనాథ ఆశ్రమంలో దుర్గమ్మను చేర్పించారు. 10 రోజుల కింద ఆరోగ్యం క్షీణించడంతో ఆశ్రమ నిర్వాహకుడు కరీంనగర్​ ప్రభుత్వ హాస్పిటల్​లో చేర్పించారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఇంటికి తీసుకెళ్లాలని మూడు రోజుల కింద  డాక్టర్లు సూచించగా, ఆశ్రమానికి తీసుకెళ్లారు. చివరి చూపుకైనా ఆమెను  కుటుంబసభ్యుల చెంతకు చేర్చాలని ఆశ్రమ నిర్వాహకుడు సమాచారం అందించాడు.

అయినా ఎవరూ రాలేదు. ఆదివారం దుర్గమ్మ మృతి చెందినట్టు తెలిపినా పట్టించుకోలేదు. అటువైపు వెళ్లలేదు.  దీంతో ఆశ్రమ నిర్వాహకుడు మంచికట్ల శ్రీనివాస్ మృతురాలు దుర్గమ్మ దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అయినవాళ్లు రాకున్నా మానవత్వం చాటుకున్నాడు.