కొడుకు పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్​కు కష్టం చెప్పుకుంది..అంతలోనే

  • కలెక్టర్​కు కష్టం చెప్పుకుని అంతలోనే అందని లోకాలకు...
  • కొడుకు పట్టించుకోవడం లేదంటూ గ్రీవెన్స్​కు..
  • ఇంటికి వెళ్లాక కన్నుమూత 

ఆదిలాబాద్, వెలుగు: కొడుకు పట్టించుకోవడం లేదని ఆదిలాబాద్​లో కలెక్టర్​కు చెప్పుకున్న ఓ వృద్ధురాలు ఇంటికి వెళ్లాక కన్నుమూసింది.  ఆదిలాబాద్​లోని క్రాంతి నగర్ కాలనీకి చెందిన విఠాబాయి (90), దేవ్‌‌రావు దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. పెద్ద కొడుకు చనిపోగా, అనారోగ్యంతో బాధపడుతున్నా తల్లితో పాటు తండ్రిని చిన్న కొడుకు గంగారం పట్టించుకోవడం లేదు. దీంతో సోమవారం గోడు వెల్లబోసుకునేందుకు వృద్ధ దంపతులు..బిడ్డతో కలిసి కలెక్టరేట్​లోని గ్రీవెన్స్​కు వచ్చారు. కలెక్టర్​ను కలిసి తమ కష్టం చెప్పుకున్నారు.

 తాము కట్టిన ఇంట్లోంచి తమనే గెంటేశాడని కన్నీటిపర్యంతమయ్యారు. తమను పట్టించుకోకపోవడంతో ఆదిలాబాద్‌‌ రూరల్‌‌ మండలం అర్లి-బిలోని బిడ్డ వద్ద ఉంటున్నామని చెప్పారు. స్పందించిన కలెక్టర్​చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. దీంతో న్యాయం జరుగుతుందనే సంతోషంలో అంతా కలిసి ఊరికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత కొద్దిసేపటికే విఠాబాయి అస్వస్థతకు గురైంది. పడుకోబెట్టగా బిడ్డ, భర్త చేతుల్లో కన్నుమూసింది.