ఫిబ్రవరి 7 నుంచి పాత యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 7 నుంచి పాత యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
  • స్వస్తివాచనంతో  అంకురార్పణ, 13న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగింపు
  • 9న ఎదుర్కోలు, 10న కల్యాణం, 11న రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. శుక్రవారం స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణం, మృత్సంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి అలంకార సేవలను చేపట్టనున్నారు. 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9న ఎదుర్కోలు, 10న తిరుకల్యాణం, 11న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 10వ తేదీ రాత్రి నిర్వహించే స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కల్యాణ టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించారు. అనంతరం 13వ తేదీన అష్టోత్తరశతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో లైటింగ్, భక్తులు కోసం చలువ పందిళ్లు, మంచినీటి వసతి కల్పించారు. 

ముగిసిన అధ్యయనోత్సవాలు

పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం ‘నూత్తందాది శాత్తుమొరై’ పూజలు నిర్వహించిన అర్చకులు అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు. ముందుగా ఉప ప్రధానార్చకులు మాధవాచార్యుల ఆధ్వర్యంలో పురప్పాటు సేవ, రామానుజాచార్య తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారంలో స్వామిఅమ్మవార్లను ముస్తాబు చేసి తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం మూలవరులకు నూత్తందాది శాత్తుమొరై పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ, ఏఈవో కృష్ణ పాల్గొన్నారు.