- ఆకతాయి వేధింపులతో ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ మృతి
నర్సింహులపేట, వెలుగు : ఆకతాయి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రాఖీ పండుగకు ముందు రోజే తమ్ముళ్లకు రాఖీ కట్టి తనువు చాలించింది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం లాలితండాకు చెందిన గుగులోత్ అఖిల (17) కోదాడలో పాలిటెక్నిక్ చదువుతోంది. ఖమ్మంకు చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక పురుగుల మందు తాగింది.
కుటుంబసభ్యులు ఆమెను మహబూబాబాద్ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. తనకు ఏదో జరగబోతోందని ఊహించిన అఖిల తన తమ్ముడితో పాటు పెద్దనాన్న కొడుకుకు శనివారమే రాఖీ కట్టాలనుకుంది. ఆమె కోరిక మేరకు వారిని పిలిపించి రాఖీ కట్టించారు. ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో అఖిల కన్నుమూసింది. వేధించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు తెలిపారు.