ఈ జంటది రికార్డు కాపురం.. వారి దాంపత్యానికి 79 ఏళ్లు
క్విటో(ఈక్వెడార్): పాతికేళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి, సీక్రెట్గా చర్చిలో పెళ్లిచేసుకున్నరు.. ఆ రోజు చేసిన ప్రామిస్ను అక్షరాలా నిలబెట్టుకుంటూ కష్టాల్లోనూ కలిసే ఉన్నరు. ఈ మధ్యనే వాళ్లకాపురానికి 79 ఏళ్లు నిండడంతో ఆ జంట గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇద్దరి వయసు కలిపితే 215 సంవత్సరాలు. గతంలో ఈ రికార్డుకెక్కిన జంట వయసు 212 సంవత్సరాలా 52 రోజులు. దీంతో ప్రపంచంలోనే వృద్ధ దంపతులు(ఓల్డెస్ట్ మ్యారిడ్ కపుల్) గా గిన్నిస్ వాళ్లు సర్టిఫై చేశారు. ఈక్వెడార్ రాజధాని క్విటోలో ఉంటున్న ఈ వృద్ధులు ఇద్దరూ టీచర్లే. ఆ తాత పేరు జులియో మోరా, అవ్వ పేరేమో వాల్డమినా క్వింటెరస్.. జులియో 1910లో పుట్టగా, క్వింటెరస్ 1915లో జన్మించారు. ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 1941 ఫిబ్రవరి 7న సీక్రెట్గా పెళ్లిచేసుకున్నరు. అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. వందేళ్లు పైబడ్డా ఇప్పటికీ ఇద్దరూ చలాకీగా పిల్లలు, పిల్లల పిల్లలు, వారి పిల్లలతో ఆడుకుంటారట. ఈమధ్యనే ఈ జంటకు ఇంకింత ఆనందం పంచడానికి ముని ముని మనవడు కూడా వచ్చేశాడట. గిన్నిస్ కు ఎక్కడంతో ఈ జంట సంబరం మరింత పెరగగా.. కరోనా వల్ల ఈ వేడుకను కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకోలేకపోతున్నామని దిగులు పడుతున్నారని వాళ్ల పిల్లలు చెప్పారు.