మత్స్య సహకార ఎన్నికల్లో రాజకీయం.. రాజకీయ ఒత్తిడితో రిజల్ట్ ప్రకటించలే

మత్స్య సహకార ఎన్నికల్లో రాజకీయం..  రాజకీయ ఒత్తిడితో రిజల్ట్ ప్రకటించలే

గద్వాల, వెలుగు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు. ఇద్దరు లీడర్ల ఆధిపత్యం కోసం ఎన్నికలు జరిగినా రిజల్ట్  ప్రకటించకుండా ఆఫీసర్లు వాయిదా వేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గద్వాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం పట్టణంలోని వెటర్నరీ ఆఫీస్​ దగ్గర నిర్వహించారు. ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలంపూర్, గద్వాల మత్స్య గ్రామ సహకార కమిటీలు విడిపోవడంతో ఎలక్షన్​ ఆఫీసర్ గా వ్యవహరించిన ఫిషరీస్​ ఏడీ షకీలా భాను ఎన్నికలు జరిపించారు.

 అలంపూర్, గద్వాల  నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్  లీడర్ల సపోర్ట్ తో గోపాల్ ప్యానల్, చక్రధర్ ప్యానల్, లక్ష్మన్న ప్యానల్, ఇండిపెండెంట్ గా దర్రెన్న ప్యానల్ బరిలోకి దిగారు. అధికార పార్టీ లీడర్లు ఎవరికి వారే తమ ప్యానెల్​ను గెలిపించుకునేందుకు పోటీ పడ్డారు. అనంతరం చేతులెత్తే విధానంతో ఓటింగ్ నిర్వహించగా, అలంపూర్  నియోజకవర్గానికి చెందిన గోపాల్ ప్యానల్ కి 33 ఓట్లు వచ్చాయి. లక్ష్మన్న ప్యానల్ కు 20, దర్రెన్న ప్యానెల్​కు 15 ఓట్లు వచ్చాయి. గోపాల్  ప్యానెల్  విజయం సాధించినప్పటికీ రాజకీయ ఒత్తిడి కారణంగా రిజల్ట్  ప్రకటించకుండా ఎలక్షన్​ ఆఫీసర్ వెళ్లిపోయారని గోపాల్  వర్గం వారు ఆరోపించారు. ఇదిలాఉంటే కలెక్టర్​తో మాట్లాడి సోమవారం రిజల్ట్ ప్రకటిస్తామని ఎలక్షన్​ ఆఫీసర్​ తెలిపారు.