కర్మాకర్ అల్విదా..రిటైర్మెంట్‌‌ ప్రకటించిన స్టార్‌‌‌‌ జిమ్నాస్ట్ దీపా..ప్రొడునోవా క్వీన్‌‌గా ఖ్యాతి

కర్మాకర్ అల్విదా..రిటైర్మెంట్‌‌ ప్రకటించిన స్టార్‌‌‌‌ జిమ్నాస్ట్ దీపా..ప్రొడునోవా క్వీన్‌‌గా ఖ్యాతి

న్యూఢిల్లీ : ఇండియా స్టార్ జిమ్నాస్ట్‌‌, తన విజయాలతో ఆటకే పేరు తెచ్చిన  దీపా కర్మాకర్‌‌‌‌ తన కెరీర్‌‌‌‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఒలింపిక్స్‌‌లో పోటీపడిన ఇండియా తొలి మహిళగా రికార్డు సృష్టించి.. అత్యంత ప్రమాదకరమైన ప్రొడునోవా వాల్ట్‌‌ విన్యాసాన్ని విజయవంతంగా చేసి ఔరా అనిపించిన కర్మాకర్ 31 ఏండ్లకే ఆటకు సెలవిస్తున్నట్టు సోమవారం తెలిపింది. త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ 2016 రియో ఒలింపిక్స్‌‌ వాల్ట్‌‌ ఫైనల్లో నాలుగో స్థానం సాధించింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో ఒలింపిక్ మెడల్‌‌ చేజార్చుకుంది. 

అయినా తన ఆటతో  ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ‘బాగా ఆలోచించిన తర్వాత  నేను జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్స్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ, తప్పుకునేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి  జిమ్నాస్టిక్స్ నా జీవితంలో కేంద్రంగా ఉంది. ఈ  ఆటలో  ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. వాటి మధ్యలోని ప్రతీ క్షణానికి నేనెంతో కృతజ్ఞురాలను’ అని కర్మాకర్ తన ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో కోచ్‌‌గా మారే అవకాశం ఉందని దీపా తెలిపింది.  లేదంటే తర్వాతి తరం జిమ్నాస్ట్‌‌లు వారి కలలను నెరవేర్చుకునేందుకు మద్దతిస్తానని చెప్పింది.

ప్రొడునోవా చేసిన ఐదో మహిళగా రికార్డు 

అగర్తలాలో పుట్టిన దీపా జిమ్నాస్టిక్స్‌‌ చరిత్రలో ప్రొడునోవా విన్యాసాన్ని విజయవంతంగా చేసిన ఐదో మహిళగా రికార్డు సృష్టించింది. గాల్లోకి ఎగిరి రెండుసార్లు సోమర్‌‌‌‌సాల్ట్స్‌‌ చేసే ఈ విన్యాసాన్ని ‘వాల్ట్‌‌ ఆఫ్‌‌ డెత్‌‌’గా పరిగణిస్తారు. గాయపడే ప్రమాదం చాలా ఎక్కువ.  రియో ఒలింపిక్స్‌‌లో ప్రొడునోవాను పెర్ఫామెన్స్‌‌ చేయడం తన జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుందని దీపా తెలిపింది. ‘జీవితంలో  వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను సాధించిన ప్రతిదానికీ ఎంతో  గర్వపడుతున్నా. ప్రపంచ వేదికపై  దేశానికి  ప్రాతినిధ్యం వహించడం

పతకాలు సాధించడం మరీ ముఖ్యంగా రియో ​ఒలింపిక్స్‌‌లో ప్రొడునోవా వాల్ట్‌‌ను చేయడం ఎప్పటికీ నా కెరీర్‌‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఈ క్షణాలు కేవలం నా విజయాలు మాత్రమే కాదు. అవి మన దేశంలో కలలు కనే ధైర్యం ఉండి  కృషి, పట్టుదలతో  ఏదైనా సాధ్యమవుతుందని నమ్మే ప్రతి యువతికి విజయాలు. నేనిప్పుడు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు,  పాఠాలతో నిండిన హృదయంతో  పోటీ నుంచి తప్పుకుంటున్నా.  కోచ్‌‌లు, సహచరులు, సహాయక సిబ్బందికి, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని దీపా తెలిపింది.  

 ఒడిదొడుకుల ప్రయాణం

ఆరేండ్ల వయసులో జిమ్నాస్టిక్స్‌‌లోకి వచ్చిన దీపా కర్మాకర్‌‌‌‌ కోచ్‌‌లు సోమా నంది, బిశ్వేశ్వర్‌‌‌‌ నంది శిక్షణలో రాటుదేలి మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా.. ధైర్యంగా, పట్టుదలగా ముందుకొచ్చింది. అసలు దీపా జిమ్నాస్ట్‌‌ అవ్వడమే అనూహ్యం. ఎందుకంటే తను ఫ్లాట్‌‌ హీల్స్‌‌ (చదునైన పాదాలు)తో పుట్టింది. ఇలాంటి వాళ్లు జిమ్నాస్టిక్స్‌‌ చేయలేరు. కానీ, ఎంతో కష్టం, మరెంతో శిక్షణతో ముందుగా తన పాదంలో వంపు తెచ్చుకుంది దీపా. 2008లో జూనియర్‌‌‌‌ నేషనల్స్‌‌లో గోల్డ్‌‌తో ఆమె ప్రస్థానం మొదలైంది.  

2014  గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌‌ వాల్ట్‌‌లో కాంస్య పతకం నెగ్గి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఈవెంట్‌‌లో పతకం నెగ్గిన దేశ తొలి మహిళగా నిలిచిన ఆమె 2015లో ఆసియా చాంపియన్‌‌షిప్స్‌‌లో కాంస్యం సాధించి 2015  వరల్డ్ చాంపియన్‌‌ షిప్‌‌లో ఐదో ప్లేస్‌‌తో ఆకట్టుకుంది. 2016 రియో​ఒలింపిక్స్‌‌లో మెడల్‌ నెగ్గకపోయినా తన పెర్ఫామెన్స్‌‌తో ఇండియా టాప్ జిమ్నాస్ట్‌‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గాయాలు, శస్త్రచికిత్సతో ఆమె కెరీర్‌‌‌‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన పనైపోయిందని అనుకున్న దశలో 2018 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌‌ గోల్డ్‌‌తో చరిత్ర సృష్టించి అద్భుత రీఎంట్రీ ఇచ్చింది. 

తర్వాతి ఎడిషన్‌‌లో కాంస్యం నెగ్గిన కర్మాకర్‌‌‌‌  2021లోఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌‌షిప్‌‌లో గోల్డ్‌‌తో మళ్లీ మెరిసింది. తన కెరీర్‌‌‌‌కు తిరుగులేదు అనుకుంటున్న సమయంలో డోపింగ్‌‌ వివాదం వెనక్కులాగింది.ఆస్తమా, దగ్గుకు ఉపయోగించే డ్రగ్‌‌ వాడి రెండేండ్ల నిషేధం ఎదుర్కొంది. గతేడాది జులైలో బ్యాన్‌ ముగిసినా.. తిరిగి పోటీలోకి రాలేకపోయిన కర్మాకర్‌‌‌‌ వీడ్కోలు చెప్పింది. తన ఆటతో పద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్న దీపా ఇండియా జిమ్నాస్టిక్స్‌‌ హిస్టరీలో లెజెండ్‌‌గా గుర్తుండిపోవడం ఖాయం.