భద్రాచలం చేరుకున్న ఒలింపిక్​ డే జ్యోతి

భద్రాచలం చేరుకున్న ఒలింపిక్​ డే జ్యోతి

భద్రాచలం, వెలుగు : అంతర్జాతీయ ఒలింపిక్​ డే సందర్భంగా ఈనెల 20వ తేదీన దమ్మపేటలో ప్రారంభమైన ఒలింపిక్​ డే రన్​ క్రీడాజ్యోతి శుక్రవారం భద్రాచలం చేరుకుంది. చర్ల రోడ్డులోని నన్నపనేని మోహన్​ హైస్కూల్​ వద్ద ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు క్రీడాజ్యోతిని అందించారు. అనంతరం ఆయన రన్​లో పాల్గొన్నారు. ఇల్లెందు వెళ్లి అక్కడి నుంచి ఈనెల 23వ తేదీన కొత్తగూడెంలో రన్ ముగియనుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలం మన్యం నుంచి ఎందరో గిరిజన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. ఒలంపిక్ క్రీడలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్​ అసోషియేషన్​ జనరల్​ సెక్రటరీ మహీధర్, జాయింట్​సెక్రటరీ నాగేందర్, అథ్లెటిక్​కోచ్ జన్ను గిరిప్రసాద్, బీపీఎల్ స్కూల్​పీడీ దుర్గారావు, జిల్లా బేస్​బాల్​ సెక్రటరీ ప్రవీణ్, పీడీ శ్వేత, ఇందు తదితరులు పాల్గొన్నారు.