
ఒలింపిక్స్‌లో పోటీ పడాలనుకునే క్రీడాకారులు ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా భరిస్తారు. ముఖ్యంగా కొందరు మహిళా అథ్లెట్లు తమకు సహజంగానే ఎదురయ్యే సవాళ్లతో పాటు అమ్మతనం కూడా తమ కలకు అడ్డురాదని నిరూపిస్తుంటారు. ఈజిప్ట్ ఫెన్సర్ నడా హఫేజ్ సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. హఫేజ్ ఏకంగా ఏడు నెలల గర్భంతోనే ఈ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తనే ఈ విషయం వెల్లడించింది. ‘నేను లిటిల్ ఒలింపియన్‌ను మోస్తున్నాను. శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సవాళ్లలో మా ఇద్దరికీ సమాన వాటా ఉంది. జీవితం, ఆటను బ్యాలెన్స్ చేసేందుకు పోరాడాల్సి వస్తోంది’ అంటూ తొలి రౌండ్ గెలిచిన తర్వాత 26 ఏండ్ల హఫేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కానీ, ఆమె రెండో రౌండ్‌లో ఓడిపోయింది.