
చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకున్న ఆ కుర్రాడు రెజ్లింగ్‌పై మనసు పారేసుకున్నాడు. తనకు ఊహ తెలిసి.. ఇక కుస్తీని కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకుంటున్న దశలో అతని జీవితం తలకిందులైంది. అనారోగ్య కారణాలలో అమ్మానాన్న ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. 11 ఏండ్ల వయసున్న ఆ కుర్రాడికి ఏం చేయాలో.. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. కానీ, 2012లో సుశీల్ కుమార్ ఒలింపిక్ మెడల్ తీసుకురావడం అతని జీవితానికి దారి చూపింది. సుశీల్‌ను చూసి స్ఫూర్తి పొంది ఏనాటికైనా అతని స్థాయికి ఎదగాలని నిశ్చయించుకున్నాడు. తల్లిదండ్రులు దూరమైనా.. తాత వెన్నంటి నిలవడంతో ఒక్కో అడుగు ముందుకేసిన ఆ కుర్రాడు 12 ఏండ్లు తిరిగే సరికి ఒలింపిక్ మెడలిస్టుగా నిలిచాడు. అతనే అమన్ సెహ్రావత్. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున బరిలో నిలిచిన ఏకైక పురుష రెజ్లర్. మెగా గేమ్స్‌లో రెజ్లర్లు బృందం ఒట్టి చేతులతో తిరిగొస్తుందని అనుకున్న దశలో పతక పట్టు పట్టిన మొనగాడు.
ఏడాదిన్నరగా వివాదాలతో సతమతమై, పారిస్‌లో వినేశ్ ఫొగాట్ ఎపిసోడ్‌తో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన ఇండియా రెజ్లింగ్‌కు అమన్ తన పతక పట్టుతో ఉత్సాహాన్ని అందించాడు. అంచనాలు లేకుండా వచ్చిన అమన్ సైలెంట్‌గా తన పని తాను చేసుకెళ్లాడు. తొలి రోజు రెండు బౌట్లలో అద్భుత విజయాలు సాధించిన తర్వాత సెమీఫైనల్లో ఓడినా.. కాంస్య పతక పోరులో మాత్రం పట్టు జారకుండా చూసుకున్నాడు. హర్యానా ఝాజ్జర్ జిల్లా బిరోహార్‌కు చెందిన అమన్ మూడేండ్లుగా ఇండియన్ రెజ్లింగ్‌లో దూసుకొస్తున్న ధృవతార. 2022 అండర్23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అంతకుముందు జూనియర్ సర్క్యూట్‌లో సత్తా చాటిన సెహ్రావత్ తన సక్సెస్‌ను సీనియర్ కేటగిరీలోనూ కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయిన అమన్ తన తాత మంగేరామ్ సెహ్రావత్ ప్రోద్భలంతో ఈ ఆటలో అడుగు ముందుకేస్తూ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గే స్థాయికి ఎదిగాడు. చిన్నప్పుడు మట్టి కుస్తీతో ఓనమాలు నేర్చుకొని తన దోస్తులను ఓ పట్టు పట్టేస్తూ హుషారు చూపెట్టాడు. అమన్ ఆసక్తిని, ఆటలో చూపుతున్న ప్రతిభను గుర్తించిన మంగేరామ్ అన్నీ తానై ముందుకు నడిపించాడు. ఇండియాకు పలువురు ఒలింపిక్ మెడలిస్టులను అందించిన ప్రఖ్యాత ఢిల్లీలోని ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియంలో శిక్షణలో చేర్పించాడు.
అక్కడి నుంచి అమన్ కెరీర్ పరుగులు పెట్టింది. 2021లో తొలి నేషనల్ చాంపియన్‌షిప్ నెగ్గిన తర్వాత తను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2022లో మూడు ర్యాంకింగ్ టోర్నీల్లో మెడల్స్‌తో మెప్పించిన అతను అండర్23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన దేశ తొలి రెజ్లర్‌గా రికార్డు సృష్టించాడు. అండర్ 23 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచాడు. గతేడాది సీనియర్ లెవెల్లోకి వచ్చిన అమన్ మేటి రెజ్లర్లనూ పడగొడుతూ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సొంతం చేసుకొని తడాఖా చూపెట్టాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్ బెర్తు దక్కించుకున్న సెహ్రావత్ 21 ఏండ్ల వయసులో తొలి విశ్వ క్రీడల్లోనే పతకం గెలిచి ఔరా అనిపించాడు. అమన్‌లో మంచి ప్రతిభ, పట్టుదల ఉంది. ఇదే జోరును కొనసాగిస్తే తన స్ఫూర్తి సుశీల్ కుమార్ స్థాయిని అందుకునే దమ్మున్నోడిలా కనిపిస్తున్నాడు.