సాగర్ రాణా అనే రెజ్లర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సుశీల్‌కుమార్ తో పాటు ముండ్కా ప్రాంతానికి చెందిన మరో నిందితుడు అజయ్‌ని సైతం పోలీసులు జలంధర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ అత్తర్ సింగ్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, కరంబీర్ బృందం సుశీల్ కుమార్ ను అరెస్టు చేసింది. ఈ నెల 4న ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ రాణా అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. సుశీల్ కుమార్ దాడి చేయడంతోనే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచి సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సుశీల్‌పై కేసు నమోదు చేశారు. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న సుశీల్ కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఒకానొక తరుణంలో సుశీల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని సైతం పోలీసులు ప్రకటించారు. కాగా.. సుశీల్ కుమార్ ఇటీవల ఢిల్లీ రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేయగా.. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలంపిక్స్ లో, ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్ లో ఇండియా తరఫున పాల్గొని కాంస్య, రజత పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.