ఒలింపిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌లో నర్సరీ

ఒలింపిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌లో నర్సరీ

పారిస్‌‌‌‌ :  నాలుగేండ్లకు ఒక్కసారి జరిగే ఒలింపిక్స్‌‌‌‌లో  పోటీ పడాలని, పతకం నెగ్గాలని ఎంతో మంది క్రీడాకారులు కలలు కంటారు. పెండ్లి చేసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొందరు అథ్లెట్లు తమ లక్ష్యం దిశగా ముందుకెళ్తుంటారు. అలాంటి వారి కోసం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వినూత్న ఆలోచన చేసింది. గేమ్స్ చరిత్రలో తొలిసారిగా పారిస్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌లో నర్సరీని ఏర్పాటు చేసింది.  బిడ్డలు ఉన్న తల్లులు, తండ్రుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. 

ఒలింపిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌లో నాన్‌‌‌‌ రెసిడెన్షియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన నర్సరీ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇందులో  మహిళా అథ్లెట్లు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక  ఏరియాను రూపొందించారు. సౌకర్యవంతమైన సీటింగ్‌‌‌‌తో కూడిన నర్సరీల్లో  చిన్న పిల్లలు ఆడుకునేందుకు ప్లేజోన్‌‌‌‌, ఆట వస్తువులు,  డైపర్లు, వైప్స్‌‌‌‌ అందుబాటులో ఉంచారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే వీటిలో చిన్నారులతో ఒలింపిక్స్‌‌‌‌లో పోటీ పడే తల్లి, తండ్రి  ఆహ్లాదకరంగా గడిపి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆర్గనైజర్స్ చెబుతున్నారు.