
పారిస్: బ్యాడ్మింటన్‌లో కచ్చితంగా పతకం తెస్తారని ఆశిస్తున ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి అంచనాలను అందుకుంటున్నారు. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్తు సొంతం చేసుకున్న సాత్విక్, చిరాగ్ మరో విజయంతో గ్రూప్ దశలో టాప్ ప్లేస్ సాధించి నాకౌట్ రౌండ్‌కు సిద్ధమయ్యారు. మెన్స్ డబుల్స్ గ్రూప్–సి చివరి పోరులో మూడో సీడ్ ఇండియా కుర్రాళ్లు 21–13, 21–13తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్ రియాన్–ఫజర్‌ను వరుస గేమ్స్‌లో చిత్తు చేశారు. దాంతో గ్రూప్ టాపర్లుగా క్వార్టర్స్ చేరుకున్నారు. క్వార్డర్ ఫైనల్ డ్రాను బుధవారం వెల్లడిస్తారు. కాగా, విమెన్స్ డబుల్స్‌లో ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో గ్రూప్–సి చివరి మ్యాచ్‌లో 15–21, 10–21తో సెతత్యన మపాస–ఏంజెలా యు (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు.
పన్వార్‌కు నిరాశ
రోయింగ్‌లో ఇండియా ఏకైక ఆటగాడు బాల్‌రాజ్ పన్వార్ నిరాశ పరిచాడు. మెన్స్ సింగిల్ స్కల్స్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్స్ హీట్ రేస్‌లో ఐదో స్థానంతో సరిపెట్టిన అతను పతక రేసు నుంచి వైదొలిగాడు. 25 ఏండ్ల పన్వార్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో హీట్‌ను 7 నిమిషాల 5.10 సెకండ్లతో పూర్తి చేశాడు. ఇప్పుడు అతను 13 నుంచి 24వ స్థానాల కోసం పోటీ పడనున్నాడు.