రికార్డు సృష్టించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

 రికార్డు సృష్టించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

జూన్ 4న వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో స్పీకర్ ఓం బిర్లా రికార్డు సృష్టించారు.   స్పీకర్ గా పనిచేసి మళ్లీ లోక్ సభకు ఎన్నికైన నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. గత 20 ఏళ్లలో  ఈ ఘనత సాధించింది ఓం బిర్లానే కావడం విశేషం.  రాజస్థాన్‌లోని కోట పార్లమెంట్ నియోజకవర్గం నుండి  పోటీ చేసిన ఆయన 41 వేల 974 ఓట్ల తేడాతో గెలుపొందారు. బిర్లాకు మొత్తం 7 లక్షల 50 వేల496 ఓట్లు వచ్చాయి.  దీంతో స్పీకర్ గా పనిచేసి వరుసగా లోక్‌సభకు రెండోసారి ఎన్నికైన నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన పీఏ సింగ్మా 1996లో లోక్‌సభ స్పీకర్ గా పనిచేసి 1998లో  మేఘాలయలోని తురా నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఈ ఘనత సాధించింది ఓం బిర్లానే కావడం విశేషం.  

1999లో ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం నుండి టీడీపీ నేత  బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బాలయోగి 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగి స్థానంలో శివసేన నేత మనోహర్ జోషి బాధ్యతలు చేపట్టారు. అయితే, జోషి 2004 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత ఏక్నాథ్ గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు.  

2004లో బోల్పూర్ సీటును గెలుచుకున్న సీపీఐ(ఎం) నేత సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఛటర్జీ తన పార్టీతో విభేదాల కారణంగా 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయాల నుండి విరమించుకున్నారు. 2009లో, కాంగ్రెస్ సభ్యురాలు మీరా కుమార్ బీహార్‌లోని ససారమ్ పార్లమెంటరీ స్థానం నుంచి గెలిచి 15వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే 2014,  2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 

2014లో ఇండోర్‌ నుంచి బీజేపీ నేత సుమిత్రా మహాజన్‌ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహాజన్‌ను బీజేపీ రంగంలోకి దింపలేదు. 2019లో కోటా పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2024లో బిర్లా కాంగ్రెస్‌కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్‌ను ఓడించి రికార్డు సృష్టించారు.  లోక్‌సభకు ఎన్నిక కావడానికి ముందు ఓం బిర్లా 2003, 2008, 2013లో మూడు పర్యాయాలు ఎన్నికైన రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.