లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుందంటే.?

లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుందంటే.?

ఇవాళ(జూన్ 26న) లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహించనున్నారు. NDA తరపున మాజీ స్పీకర్ ఓంబిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ ఎంపీలకు 3 లైన్ల విప్ జారీ చేశాయి. ఉదయం 11 గంటల నుంచి లోక్ సభలో ఉండాలని ఆదేశించాయి. 50 ఏళ్లలో స్పీకర్ పదవికి తొలిసారిగా ఎలక్షన్ జరుగుతోంది. మొదటిసారి 1952లో, చివరి సారి 1972లో స్పీకర్ ను బ్యాలెట్ తో ఎన్నుకున్నారు. 

సాధారణ మెజార్టీతోనే స్పీకర్ ను ఎన్నుకుంటారు. పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి స్పీకర్ గా ఎన్నికవుతారు. స్పీకర్ గా పోటీ చేయడానికి ప్రత్యేక అర్హతలు లేవు. లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పదవికి పోటీ చేయొచ్చు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ కొనసాగించింది. ఐతే ఈసారి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా 32 సీట్లు తక్కువగా వచ్చాయి. అటు ప్రతిపక్షాలు భారీగా పుంజుకున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీల సహకారంతో NDA ప్రభుత్వం ఏర్పాటైంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ప్రస్తుతం NDAకు 293 మంది, ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. 

సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు NDA సర్కార్ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. లోక్ సభ స్పీకర్ పదవిని అధికారపక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు చేపట్టడం ఆనవాయితీ. గత ఐదేళ్లు డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ నడిచింది. పదేళ్లుగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎక్కువ సీట్లు గెలవడంతో.. వాటి బలం పెరిగింది. కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఇండియా కూటమి పట్టుబట్టింది. స్పీకర్ పదవి అధికారపక్షం తీసుకుంటే, డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఇందుకు కేంద్రం నిరాకరించింది. దీంతో స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. 

స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయం కోసం కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు పలువురు ఇండియా కూటమి నేతలతో మాట్లాడారు. స్పీకర్ ఏకగ్రీవమయ్యే సంప్రదాయానికి సహకరించాలని కోరారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇస్తేనే.. సహకరిస్తామని ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. గత సంప్రదాయాన్ని కేంద్రం పాటించాలన్నారు.  

స్పీకర్  ఎన్నిక నిర్వహణకు ఎలాంటి కాల వ్యవధి లేదు. కొత్త లోక్ సభ కొలువుదీరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్  93 తెలుపుతోంది. సాధారణ మెజార్టీతోనే స్పీకర్ ను ఎన్నుకుంటారు.