
ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది ముందు.. 2018లో ఉమ్మడి జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలను రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బాయ్ కాట్ చేశాయి. దీనికి కారణం నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ… ఇద్దరూ పాకిస్థాన్ ఒత్తిడికి తలొగ్గడమేనని నాడు రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా పని చేస్తున్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ నాటి విషయాలను పంచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు తాను ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టి ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను స్వయంగా వెళ్లి కలిశానని చెప్పారు. కానీ పాకిస్థాన్ ఒత్తిడికి తలొగ్గి ఆ ఇద్దరూ తమ పార్టీలు ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అయితే ఆ సమయంలో ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినప్పటికీ విజయవంతంగా ఎన్నికలను నిర్వహించామని ఆయన గుర్తు చేసుకున్నారు.
PM had said that we will conduct panchayat elections (in J&K). I broke protocol & went to Omar Abdullah &Mehbooba Mufti's residence. They refused to participate under Pakistan's pressure. Terrorists also threatened yet election was held successfully: SP Malik, former J&K Governor pic.twitter.com/4o9BcLJZMV
— ANI (@ANI) May 23, 2020
ప్రజల కోసం రాజ్ భవన్..
జమ్ము కశ్మీర్ గవర్నర్ గా తాను పని చేసిన సమయంలో రాజ్ భవన్ కు ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశానని చెప్పారు సత్యపాల్ మాలిక్. ఎవరైనా నేరుగా వచ్చి అర్జీలు ఇచ్చేలా వారంలో ఒక రోజు తన సలహాదారులను అందుబాటులో ఉండాలని ఆదేశించానన్నారు. తన పీరియడ్ లో మొత్తం 95 వేల అర్జీలు రాగా.. తాను గోవాకు బదిలీ అయ్యే సమయానికి 93 వేలు పరిష్కరించానని తెలిపారు. ఇది తమ ప్రభుత్వమన్న భావనతో ప్రజల్లో చాలా వరకు గవర్నమెంట్ పై ఉన్న ఆగ్రహం తగ్గిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడంతో పాటు స్థానికులకు సరైన అవగాహన కల్పించడం ద్వారా ఉగ్రవాదులకు వారు అండగా నిలవకుండా చేయొచ్చని అన్నారు. తాను గవర్నర్ గా ఉండగా అది చేయగలిగామని చెప్పారు సత్యపాల్ మాలిక్. ప్రధాని మోదీ సూచనలతో అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. అలాగే ఒక్క ఏడాదిలో 52 డిగ్రీ కాలేజీలు, 8 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశామని, 282 జూనియర్ కాలేజీలను హైయ్యర్ సీనియర్ సెకండరీ స్కూల్స్ గా మార్చామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచామన్నారు. దాదాపు 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉండిపోయిన రెండు డ్యామ్స్ పనులు మళ్లీ మొదలు పెట్టామని, త్వరలోనే ఆ పనులు పూర్తికాబోతున్నాయని చెప్పారు. తాను గోవాకు బదిలీ అయ్యే ముందు ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ పునర్విభజన సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా కంట్రోల్ చేయగలిగామని చెప్పారు.