
హైదరాబాద్, వెలుగు: ఇండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ అజరుద్దీన్‌కు షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్ స్టాండ్‌కు అజరుద్దీన్ పేరును తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ వి. ఈశ్వరయ్య ఆదేశించారు. అజర్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో స్టేడియం స్టాండ్‌కు తన పేరును పెట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ లార్డ్స్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన ఈశ్వరయ్య దీన్ని విరుద్ధ ప్రయోజనంగా (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్)గా తేల్చారు. దాంతో తక్షణమే స్టాండ్‌కు అజరుద్దీన్ పేరును తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు.
స్టేడియంలోని నార్త్ పెవిలియన్‌కు గతంలోనే లెజెండరీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు పెట్టారు. దాన్ని ఏజీఎం ఆమోదించింది. కానీ, 2019లో అజరుద్దీన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఏజీఎం ఆమోదం లేకుండానే ఆ పెవిలియన్‌లోని స్టాండ్‌కు తన పేరు పెట్టాలని అపెక్స్ కౌన్సిల్‌లో స్వయంగా నిర్ణయం తీసుకోవడం రూల్స్‌కు విరుద్ధమని అంబుడ్స్‌మన్ స్పష్టం చేశారు.
‘హెచ్‌సీఏ నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న వ్యక్తి స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టంగా ఉంది. దీన్ని సుప్రీం కోర్టు కూడా గతంలో బీసీసీఐ వ్యవహారాల్లో పేర్కొన్నది. ఒక వ్యక్తి తనకు స్వలాభం చేకూరేలా నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయానికి వ్యతిరేకం’ అని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య తన తీర్పులో పేర్కొన్నారు. నార్త్ పెవిలియన్‌పై అజరుద్దీన్ పేరును తక్షణమే తొలగించాలని, అలాగే టికెట్లపై కూడా అతని పేరు ముద్రించకూడదని హెచ్‌సీఏకు ఆదేశాలు జారీ చేశారు.