కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో గుంపులుగా చేరితే వైరస్ మరింత స్పీడ్‌గా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ దిశగా ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజధాని పరిధిలో గుంపులుగా చేరి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడంపై నిషేధం విధిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా ఢిల్లీ పోలీసులు, జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, పరిస్థితులపై రోజువారీగా రిపోర్ట్ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కెట్లలో షాపింగ్‌కు వెళ్లే వాళ్లు మాస్క్ పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నో మాస్క్.. నో ఎంట్రీ నిబంధనను పక్కాగా అమలు చేసేలా మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్లను ఆదేశించింది డీడీఎంఏ. అలాగే పండుగలు, వినోద కార్యక్రమాలు, కల్చరల్ ఈవెంట్స్, మతపరమైన వేడుకలు, పొలిటికల్, స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించి గ్యాదరింగ్స్, సమావేశాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది డీడీఎంఏ. అయితే బార్‌లు, రెస్టారెంట్లు లాంటివి 50 శాతం సీటింగ్‌తో ఓపెన్ చేసుకోవచ్చని, పెళ్లిళ్లు లాంటివి ఫంక్షన్లు 200 మంది అతిథులతో జరుపుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Delhi Disaster Management Authority in view of rising COVID cases and variant of concern-Omicron, instructs DMs to take all required measures in their respective jurisdictions to control the spread. No mask/No entry should be strictly ensured at shops/workplaces pic.twitter.com/LyHgcM3cv5
— ANI (@ANI) December 22, 2021
దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. అందులో అత్యధికంగా ఢిల్లీలోనే 57 కేసులు ఉన్నాయి. దీంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పబ్లిక్ గ్యాదరింగ్స్‌పై ఆంక్షలు పెట్టాలని, అవసరమైతే నైట్ కర్ఫ్యూలు విధించాలని చెప్పింది.