ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇవాళ్టి నుంచే నైట్ కర్ఫ్యూ అమలు

ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇవాళ్టి నుంచే నైట్ కర్ఫ్యూ అమలు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి వరకు దాదాపు మూడు వందలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వోతో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో థర్డ్‌ వేవ్ ముప్పుపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు మళ్లీ వార్‌‌ రూమ్స్‌ను యాక్టివేట్ చేయాలని, అవసరమైతే కరోనా ఆంక్షలను కఠినతరం చేయాలని, నైట్ కర్ఫ్యూలు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

దీంతో అనేక రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పండుగలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించగా.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రానప్పటికీ వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ (గురువారం) రాత్రి నుంచే నైట్‌ కర్ఫ్యూ అమలుకు సిద్ధమయ్యారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లారి ఐదు గంటల వరకూ నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని ఆంక్షలు పెడతామన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఒక్క ఒమిక్రాన్‌ కేసు కూడా లేదని, అయితే వైరస్‌ కేసులు వచ్చే ముప్పు ఉన్నందున ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని శివరాజ్‌ సింగ్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ,  మహారాష్ట్ర,  యూపీ,  కర్నాటకలో  క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై  ఆంక్షలు విధించారు. తెలంగాణలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు.. రాష్ట్ర సర్కారును ఆదేశించింది.