పద్మారావునగర్ (హైదరాబాద్), వెలుగు: గాంధీ ఆసుపత్రిలో ఆదివారం కరోనా పాజిటివ్ వచ్చిన విదేశీయుడు ఒకరు అడ్మిట్ అయినట్లు తెలిసింది. పాజిటివ్ వచ్చిన సోమాలియాకు చెందిన వ్యక్తి ఆస్పత్రిలో చేరగా, అతనికి ఒమిక్రాన్ సోకిందా? వేరే వేరియంటా? అన్నది తేల్చేందుకు శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు ఓ డాక్టర్ వెల్లడించారు. రిజల్ట్ వచ్చాకే అతనికి ఒమిక్రాన్ సోకిందా? లేదా? అన్నది తేలుతుందన్నారు. ఒమిక్రాన్ అనుమానితుడిని గాంధీలో చేర్చుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
134 కేసులు.. ఒకరు మృతి
రాష్ట్రంలో మరో 134 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 6,79,564కి పెరిగిందని చెప్పింది. కరోనాతో ఆదివారం ఒకరు మరణించగా మృతుల సంఖ్య 4,015కి చేరిందని అధికారులు తెలిపారు. ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి ఆదివారం 532 మంది రాష్ట్రానికి వచ్చారని అధికారులు చెప్పారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.