పెరుగుతున్న కేసులు థర్డ్​ వేవ్​కు సిగ్నల్

పెరుగుతున్న కేసులు థర్డ్​ వేవ్​కు సిగ్నల్
  • భయపడాల్సిన పనిలేదు: డీహెచ్ శ్రీనివాసరావు
  • ఆంక్షలుండవు, జాగ్రత్తలు తీసుకుంటే చాలు
  • మాస్క్​లతో సినిమా, బార్​, పబ్‌లకూ పోవొచ్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడం థర్డ్ వేవ్​కు సూచన అని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోందని, మరింత పెరగొచ్చని చెప్పారు. ‘‘ఒమిక్రాన్ జనాల్లోకి వెళ్లిపోయింది. ట్రావెల్ హిస్టరీ, కాంటాక్ట్ హిస్టరీ లేనోళ్లకు కూడా హైదరాబాద్‌లో ముగ్గురికి ఒమిక్రాన్ సోకింది. వచ్చే మూడు, నాలుగు వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయి. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలు థర్డ్ వేవ్‌కు ప్రారంభం. ఒమిక్రాన్ బారిన పడినవాళ్లలో 90 శాతం మందిలో లక్షణాలు కన్పించడం లేదు. మిగతా 10 శాతంలోనూ హాస్పిటల్ అడ్మిషన్ అవసరమయ్యేది బహుశా ఒక్క శాతమే. ఒమిక్రాన్‌ కు భయపడాల్సిన పని లేదు. వ్యాక్సిన్ వేయించుకుని, మాస్క్ పెట్టుకుని అన్ని పనులూ చేసుకోవచ్చు. రెండేండ్ల నుంచి మనల్ని మనం చాలావరకు కట్టేసుకున్నం. ఇప్పుడా పరిస్థితుల్లేవు. జాగ్రత్తగా ఉండాలే తప్ప మరీ లాక్ చేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలిసినప్పుడు దాక్కోనక్కర్లేదు” అని అన్నారు. ‘‘వైరస్‌‌ను ఎలా ఎదుర్కోవాలో ఈ రెండేళ్లలో నేర్చుకున్నం. ఒమిక్రాన్‌‌ను అడ్డుకోవడానికి స్ర్టిక్ట్‌‌ మెజర్స్ అవసరం లేదు. ముక్కుకు, మూతికి మాస్కులు పెట్టుకుని సినిమాలకూ వెళ్లొచ్చు. రెండు డోసులూ వేసుకున్నోళ్లు పబ్బులు, బార్లు, పార్టీలకు శుభ్రంగా వెళ్లొచ్చు’’ అని శ్రీనివాసరావు చెప్పారు.

ఒమిక్రాన్ మంచిదే

ఒమిక్రాన్‌‌ రావడం మంచిదేనని డీహెచ్ అన్నారు. ‘‘దాన్నో బ్లెస్సింగ్ లా తీసుకోవాలి. ఈ వేరియంట్ కోవిడ్‌‌కు ముగింపు పలుకుతుంది. ఆర్నెళ్లలో వైరస్ నుంచి విముక్తి లభిస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. డెల్టా కంటే ఒమిక్రాన్ 30 రెట్లు వేగంగా విస్తరిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయన్నారు. ‘‘ఈ స్పీడ్ వల్ల థర్డ్ వేవ్ కొన్ని రోజులో, వారాలో మాత్రమే ఉంటుంది. సెకండ్‌‌ వేవ్‌‌లో అత్యధికంగా ఒక్క రోజులో పది వేల కేసులొచ్చాయి. థర్డ్‌‌ వేవ్‌‌లో ఒక్క రోజులోనే ఇంతకు ఐదింతల కేసులు నమోదయ్యే చాన్సుంది. లక్షల్లో కేసులొచ్చినప్పుడు, ఒక్క శాతం మంది హాస్పిటలైజ్‌‌ అయినా భారీగా బెడ్లు, హాస్పిటళ్లు కావాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉన్నం. 60 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేశాం. లక్షణాల్లేని వాళ్లకు టెస్టులు అవసరం లేదు. లక్షణాలున్న వాళ్లు టెస్ట్‌‌ చేయించుకుని, సెల్ఫ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉండాలి. థర్డ్‌‌వేవ్‌‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ బలమైన ఆయుధం. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి” అని సూచించారు.

280  కేసులు.. ఒకరు మృతి

రాష్ట్రంలో మరో 280 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. గురువారం 37,926 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్​లో 167 మందికి, జిల్లాల్లో 113 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 6,81,587కి పెరిగాయని, 6,73,999 మంది రికవర్ అయ్యారని అధికారులు చూపించారు. మరో 3,563 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనాతో గురువారం ఒకరు మరణించారని, మృతుల సంఖ్య 4025కి చేరిందని తెలిపారు. ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి 143 మంది హైదరాబాద్‌‌కు వచ్చారన్నారు.  వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌‌ వచ్చిందని, శాంపిల్స్‌‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌‌కు పంపించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు చూపించారు. వీటితో కలిపి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కు పెరిగింది. ఇప్పటివరకు 22 మంది రికవర్‌‌ అవ్వగా.. మిగిలిన వాళ్లు ఐసోలేషన్‌‌లో ఉన్నారు.