
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రిపబ్లిక్‌డే సందర్భంగా ఈ నెల 26న జెండా వద్ద రాజ్యాంగ గ్రంథాన్ని, అంబేద్కర్ఫొటోను ఏర్పాటు చేయాలని ధర్మసమాజ్ పార్టీ చీఫ్ డా.విశారదన్ మహారాజ్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో రోజూ విద్యార్థుతో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లక్ష ఉత్తరాలతో సీఎం రేవంత్ రెడ్డి మనసు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
ధర్మసమాజ్‌పార్టీ, తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ సంయుక్తంగా ఈ లెటర్స్ రాసినట్లు వివరించారు. జెండా వద్ద రాజ్యాంగ గ్రంథాన్ని, అంబేద్కర్ఫొటోను ఏర్పాటు చేయటం, విద్యా సంస్థల్లో రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించడం వంటి తమ డిమాండ్లను అందరూ ఆచరించేలా తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను ఆదేశించాలని కోరుతూ లక్షమంది పౌరులతో లెటర్స్ రాస్తున్నట్టు వివరించారు. తమ డిమాండ్ల అమలు నిర్ణయాన్ని శనివారంలోగా జీవో ద్వారా తీసుకురావాలని కోరారు. మూడు రోజుల నుంచి తెలంగాణ అంతటా లక్ష ఉత్తరాల ఉద్యమం చేపట్టినట్టు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత రాజ్యాంగాన్ని దేశమంతటికీ ఎత్తి చూపిన దృశ్యం నిజమే అయితే..రేవంత్‌రెడ్డి తెలంగాణలో రాజ్యాంగ అమలు దినమైన 26న తమ డిమాండ్‌ను అమలు చేయాలన్నారు. అలాచేయకపోతే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నాటకం, కులగణన నాటకం మొదలు పెట్టినట్టుగా భావించాల్సి వస్తుందని విశారదన్ మహారాజ్ పేర్కొన్నారు.