రేపు కరీంనగర్​లో కాంగ్రెస్ సభ

హాజరవనున్న చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్, జైరాం రమేశ్​

23 షరతులతో సభకు పోలీసుల పర్మిషన్

హైదరాబాద్, వెలుగు : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్​లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రలో భాగంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

హోలీ, వుమెన్స్ ​డే నేపథ్యంలో మంగళవారం, బుధవారం యాత్రకు విరామమిచ్చిన రేవంత్​..మళ్లీ 9న యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ సభకు పోలీసులు 23 షరతులతో కూడిన పర్మిషన్​ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు. సభకు 50 వేల మందికి అనుమతినివ్వాలని పార్టీ నేతలు కోరగా.. సిటీ ఏసీపీ మాత్రం కేవలం 15 వేల మందికి పర్మిషన్ ఇచ్చారు. అంబేద్కర్ స్టేడియం 50 వేల మందికి సరిపోదని, ఎక్కువ మందికి అనుమతిస్తే తొక్కిసలాట వంటి ఘటనలు జరిగే ప్రమాదముందని నిరాకరించారు.

సభలో డీజే సౌండ్ సెటప్స్ వాడరాదని, సభ తర్వాత ర్యాలీలు తీయొద్దని, ట్రాఫిక్​కు ఆటంకం కలిగించొద్దని పేర్కొన్నారు. డ్రోన్​ కెమెరాలనూ వాడరాదని స్పష్టం చేశారు. పార్టీనే గ్రౌండ్​లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పటాకులు కాల్చొద్దని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సభను నిర్వహిస్తే వెంటనే అనుమతిని రద్దు చేస్తామని హెచ్చరించారు.