రష్యా యూట్యూబర్‌‌కు వేధింపులు.. ఢిల్లీలోని సరోజినీ నగర్‌‌లో ఘటన

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్‌‌కు ఢిల్లీలో వేధింపులు ఎదురయ్యాయి. సిటీలోని సరోజినీ నగర్‌‌ మార్కెట్‌లో వీడియో చేస్తుండగా, ఓ వ్యక్తి ఆమెను వేధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి  రష్యన్‌ యూట్యూబర్‌‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. దీంతో అతనికి దూరంగా వెళ్లిపోతున్నా.. ఆమెను వెంబడిస్తూనే వెళ్లాడు. ‘‘నువ్వు నా ఫ్రెండ్‌వి కాగలవా?”అని అతను అడగగా, ఆ మహిళా హిందీలో ‘‘లేకిన్‌ మై ఆప్కో నహీ జాంతి హు”(కానీ నాకు మీరు తెలియదు) అని సమాధానం ఇస్తుంది.

అప్పుడు ఆ వ్యక్తి ‘‘మనం ఫ్రెండ్స్‌ అయిన తర్వాత ఒకరినొకరు తెలుసుకోవచ్చు’’అని అనడంతో ఆమె ఒప్పుకోలేదు. తాను కొత్త ఫ్రెండ్స్‌ను కోరుకోవడం లేదని చెప్పింది. దీంతో అతను ‘‘నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు”అని ఆమెను అసౌకర్యానికి గురి చేశాడు. ఈ వీడియో కోకో యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.