- యూఎన్ జీఏలోపాకిస్తాన్ పై జైశంకర్ ఫైర్
- పీవోకేను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారమని ప్రకటన
యునైటెడ్ నేషన్స్: జమ్మూకాశ్మీర్ మరో పాలస్తీనాగా మారిపోయిందని, అక్కడి ప్రజలు వందేండ్లుగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారంటూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్ జీఏ)లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. యూఎన్ జీఏ 79వ సెషన్ సమావేశాల సందర్భంగా జైశంకర్ శనివారం ప్రసంగించారు.
‘‘యూఎన్ జీఏ వేదికగా శుక్రవారం పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల ఆవలి నుంచి టెర్రరిజాన్ని ఎగదోయాలని చూస్తున్న పాకిస్తాన్ విధానం ఎన్నటికీ సఫలం కాబోదు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు” అని ఆయన హెచ్చరించారు.
నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ని దాటి ఆజాద్ కాశ్మీర్ (పీవోకే)లోకి ప్రవేశిస్తామని భారత్ బెదిరిస్తోందన్న షరీఫ్ కామెంట్లపై జైశంకర్ స్పందిస్తూ..అక్రమంగా ఆక్రమిం చుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారమని తేల్చిచెప్పారు.