న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఆతిశిపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే. సక్సేనా ప్రశంసలు కురిపించారు. పాత సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కంటే ఆమె వెయ్యి రెట్లు మెరుగ్గా పనిచేస్తున్నదని కితాబునిచ్చారు. శుక్రవారం ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఏడో స్నాతకోత్సవంలో వీకే. సక్సేనా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీఎం ఆతిశి, యువతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఢిల్లీ సీఎం ఒక మహిళ అయినందుకు నేను ఇయ్యాల సంతోషంగా ఉన్నాను.
మునుపటి సీఎంతో పోలిస్తే ఆమె వెయ్యి రెట్లు మెరుగ్గా పని చేస్తున్నదని నేను నమ్మకంగా చెప్పగలను. భవిష్యత్తులో మీపై నాలుగు బాధ్యతలు ఉంటాయి. మొదటగా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు, కుటుంబం బాధ్యతలు తీసుకోవాలి. దేశ నిర్మాణం, సమాజం గురించి ఆలోచించడంతో పాటు జెండర్ అనే గోడను బద్దలుకొట్టి అన్ని రంగాలలో మహిళలు ఇతరులతో సమానమని నిరూపించుకోవాలి’’ అని పేర్కొన్నారు.