- శాంతియుతంగా నిరసన చేస్తే ప్రభుత్వాలు స్పందించవా?
- ఎంత మంది సీఎంలు మారినా ప్రజా సమస్యను పట్టించుకోలే
- 26 ఏండ్ల ధర్నాకు ఫలితం లేదా.. ప్రజలందరికీ తెలియాలనే యోగిపై పోటీ
- అఖిలేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా: విజయ్ సింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్, అటు మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌లపై ఓ సామాన్యుడు ఒంటరిగా పోరాడుతన్నాడు. యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఎదురు నిలవబోతున్నాడు. మరోవైపు అఖిలేశ్ పోటీ చేస్తున్న కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నాడు. రాజీకీయంగా ఎంతో బలవంతులైన ఈ ఇద్దరినీ ఢీకొంటున్నది ఒక సామాన్య స్కూల్ టీచర్. ఆయన పేరు విజయ్ సింగ్. అయితే ఆయన ఈ ఇద్దరిపై ఎందుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనేది ఒక్కరి చూద్దాం.
టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 26 ఏండ్లుగా ధర్నా..
యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన విజయ్ సింగ్ గతంలో స్కూల్ టీచర్‌గా పని చేశారు. సమాజంలో అవినీతి, అక్రమాలను చూసి సహించలేకపోయిన ఆయన యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్‌గా పోరాటానికి కంకణం కట్టుకున్నారు. టీచర్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి ల్యాండ్ మాఫియాపై పోరాడుతున్నారు. పశ్చిమ యూపీలోని పలు ప్రాంతాల్లో కొందరు అక్రమార్కులు వేలాది ఎకరాల భూములను కబ్జా చేశారు. ఈ ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన 26 ఏండ్లుగా ధర్నా చేస్తూనే ఉన్నారు. ‘‘ఈ 26 ఏండ్ల కాలంలో అన్ని పార్టీల ప్రభుత్వాలూ మారాయి. కానీ వేలాది ఎకరాలు కబ్జా చేసిన ల్యాండ్ మాఫియాపై మాత్రం చర్యలు లేవు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్య ప్రజలందరికీ తెలియాలనే పోటీ
తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని, ఫిబ్రవరి 9న గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేస్తానని 60 ఏండ్ల వయసులో ఉన్న విజయ్ సింగ్ తెలిపారు. గడిచిన 26 ఏండ్లుగా యూపీని పాలించిన ఏ ఒక్క పార్టీకి కూడా లాండ్ మాఫియాపై చర్యలు తీసుకుని, అవినీతి, అక్రమాలను నిలువరించాలని సీరియస్‌గా ప్రయత్నం చేయలేదని ప్రజలందరికీ తెలిసేలా చేయాలనే తాను యోగిపై పోటీకి నిర్ణయించుకున్నానని చెప్పారు. అవినీతిపై పోరాటం, ల్యాండ్ మాఫియాకు చెక్ పెట్టడంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు తెలియజేసేలా కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తానని అన్నారు.
నా జీవితాన్ని మార్చిన ఘటన అదే
మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. అయితే 1990వ దశకం మధ్యలో ఒక రోజు స్కూల్‌లో పాఠాలు చెప్పి.. ఇంటికి వెళ్తుండగా జరిగిన ఒక ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని విజయ్ సింగ్ చెబుతున్నారు. తాను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా దారిలో ఓ చిన్నారి ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నాడని, అమ్మా రోటీ అని అడుగుతున్నా ఆ తల్లి ఆ పిల్లాడి ఆకలి తీర్చలేని దీనస్థితిలో ఉండడం గమనించానని అన్నారు. ఈ ఘటన తనను చలింపచేసిందని, ఆ ఊరి చుట్టుపక్కల గతంలో ప్రభుత్వాలు పేదలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన భూములను కొందరు బలవంతులైన రాజీయ నేతలు, ల్యాండ్ మాఫియా కలిసి కబ్జా చేయడం వల్లే ఈ దీనస్థితి ఏర్పడిందని అన్నారు. ఆ భూములను పేదలు సాగు చేసుకుంటే కనీసం పిల్లల ఆకలి తీర్చలేని పరిస్థితి ఉండేదికాదని ఆయన చెప్పారు. దీంతో ఆ కబ్జాలో ఉన్న భూములను విడిపించి, లాండ్ మాఫియా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 1996 జనవరిలో ముజఫర్‌నగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు కూర్చున్నానని, నాటి నుంచి ప్రతి సీఎం, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా నేటికీ ఆ కబ్జాదారులపై చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
2 లక్షల ఎకరాలు పేదల భూమి కబ్జా
సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మాత్రం కనీసం కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని, గత నవంబర్‌లో కైరానాలో జరిగిన సభలో కలిసి ఈ సమస్య గురించి వివరించే ప్రయత్నం చేసినా వీలు కాలేదని విజయ్ చెప్పారు. అయితే అధికారులు తన చేతిలో ఉన్న మెమొరాండం మాత్రం తీసుకున్నారన్నారు. ఇప్పటి వరకు ల్యాండ్ మాఫియాపై ఎటువంటి చర్యలు లేకపోవడంతోనే తాను యోగిపై పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. కేవలం ముజఫర్‌నగర్, షామ్లీ ప్రాతాల్లోనే పేదలు, భూమి లేని వారికి సాగు చేసుకునేందుకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన భూములను సుమారు 2 లక్షల ఎకరాల వరకూ కబ్జాకు గురైందని, ల్యాండ్ మాఫియా, కొందరు రాజకీయ నేతలు పేద నోటికాడి తిండి లాగేసుకున్నా ఏ ఒక్క సీఎం పట్టించుకోవడం లేదని విజయ్ సింగ్ అన్నారు. గతంలో సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ కూడా ఈ ల్యాండ్ మాఫియాపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆయన పోటీ చేస్తున్న కర్హల్ నియోజకవర్గంలోనూ తాను అఖిలేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు.
కుటుంబం అండ లేదు స్నేహితులే..
26 ఏండ్లుగా ల్యాండ్ మాఫియాపై ఒంటరిగా పోరాడుతున్న తనకు కుటుంబం నుంచి పెద్దగా సపోర్ట్ లేదని, ముగ్గురు నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలిచారని విజయ్ సింగ్ చెబుతున్నారు. తన ఖర్చులు, ఇతర అవసరాలను కూడా స్నేహితులే తీరుస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక చిన్న రైతు బిడ్డనేనని, ఉన్న కొంచెం భూమిని కూడా కబ్జాదారులు లాగేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. తాను ఇంత సుదీర్ఘ కాలం పాటు ధర్నా చేయడం కుటుంబసభ్యులకు ఇష్టం లేదని చెప్పారు.
పోరాటానికి చిన్న ఫలితం
ఇన్నాళ్ల తన పోరాటంలో చాలా చిన్న ఫలితాన్ని మాత్రమే సాధించగలిగానని విజయ్ బాధగా చెబుతున్నాడు. కొందరు జిల్లా అధికారుల సాయంతో సుమారు 250 ఎకరాల భూమిని మాత్రమే తిరిగి ప్రజలకు ఇప్పించగలిగానని అన్నారు. ‘‘ప్రభుత్వాన్ని ఒక్కటే అడగాలని అనుకుంటున్నా. శాంతియుతంగా చేసే నిరసనలకు విలువ లేదా? నిరసన అంటే రోడ్లు బ్లాక్ చేసి, భారీ సంఖ్యలో జనాలు గుమిగూడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనా?” అని విజయ్ నిలదీస్తున్నారు.