నాలుగో రోజు నామినేషన్ల జోరు

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు నామినేషన్ ​ప్రక్రియ జోరుగా సాగింది. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు సోమవారం రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, గాజుల రవికుమార్, మైనార్టీ నాయకుడు అర్జుమన్, కూచాడి మాధురి తదితరులు ఆయన వెంట వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ముథోల్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ కూడా రెండు సెట్ల నామినేషన్లను అక్కడి ఎన్నికల అధికారికి అందించారు. ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేతావత్ రాజేందర్ అనే యువకుడు ఉట్నూర్​లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశాడు. బోథ్, ఆదిలాబాద్​ అసెంబ్లీ స్థానాలకు 5 నామినేషన్​లు వచ్చాయి.

బోథ్​లో బీఆర్ఎస్​అభ్యర్థి అనిల్​జాదవ్ కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ ​దాఖలు చేయగా.. ఆదిలాబాద్​లో బీజేపీ అభ్యర్థిగా పాయల్​ శంకర్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ఎంపీ సోయం బాపూరావు తదితరులున్నారు. బలిరాజ పార్టీ అభ్యర్థిగా సత్యనారాయణ ఎల్చావార్, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా ఓటర్​కార్ సురేశ్, స్వతంత్ర అభ్యర్థిగా గలిపెల్లి నాగన్న ఆదిలాబాద్​లో నామినేషన్​ వేయగా ఎన్నికల రిటర్నింగ్​ అధికారి చాహత్​బాజ్​పాయ్ వాటిని ​స్వీకరించారు.

బెల్లంపల్లిలో స్వాతంత్ర అభ్యర్థిగా రామటెంకి శ్రీనివాస్

బెల్లంపల్లిలో సోమవారం ఒక నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.రాహుల్ తెలిపారు. స్వాతంత్ర అభ్యర్థిగా రామటెంకి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూర్ నియోజకవర్గం స్థానం కోసం బీజేపీ తరుఫున జుమ్మిడి రాజేశ్, స్వతంత్ర అభ్యర్థిగా చకినారపు కిరణ్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.