ఢిల్లీలో ఆప్ ‘రేవడీ పర్ చర్చా’ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

ఢిల్లీలో ఆప్ ‘రేవడీ పర్ చర్చా’ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది. శుక్రవారం ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ 'రేవడీ పర్ చర్చా' పేరిట ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.  ఇందులో భాగంగా ఢిల్లీలోని అన్ని ప్రదేశాల్లో  మొత్తం 65 వేల సమావేశాలు నిర్వహించి..ఆప్ సర్కార్ అందించిన ఉచిత పథకాలను ప్రజలకు వివరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలపై ప్రజలందరికీ కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. 

ఆప్ మాత్రమే ఫ్రీ స్కీమ్స్ ఎలా అమలు చేయగలదో  ప్రజలకు చెప్పనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడూతూ..ఢిల్లీ ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత వైద్యం, ఉచిత విద్య, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, వృద్ధులకు ఉచిత తీర్థయాత్రలు కల్పిస్తున్నదని గుర్తుచేశారు. త్వరలోనే  ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ. వెయ్యి సహాయం- స్కీమ్ కూడా అమలు చేస్తామని ప్రకటించారు. ఆప్ సర్కార్ అందిస్తున్న ఈ 7 ఉచిత పథకాలను పార్టీ కార్యకర్తలు,  బూత్ స్థాయి ఆఫీస్ బేరర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

బీజేపీ వస్తే ఫ్రీ స్కీమ్స్ అమలు కావు

ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఆప్ సర్కార్ అమలు చేస్తున్న ఫ్రీ స్కీమ్స్ అన్నీ ఆగిపోతాయని కేజ్రీవాల్ వెల్లడించారు. బీజేపీ ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని..ఒక్క రాష్ట్రంలో కూడా ఉచిత పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. అసలు వారికి ఉచిత పథకాలు ఇవ్వాలనే ఉద్దేశమే లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఫ్రీ స్కీమ్స్ ఎలా కల్పించాలో ఆప్‌కి మాత్రమే తెలుసని చెప్పారు. ఢిల్లీ ప్రజల కోసం బీజేపీ ఇప్పటిదాకా ఏమి చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ను గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ కోరారు.