తిరువనంతపురం: బీజేపీ రాజకీయపరమైన విమర్శల్లోనూ ప్రజాస్వామ్య విలువల్ని పాటించడంలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. బీజేపీ నేతల ప్రవర్తన ఇటీవల వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియల తరహాలో ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియనట్టుగానే బీజేపీ నేతల ప్రవర్తనకు కూడా ఎటువంటి రూల్స్, ఎక్స్‌ప్లెనేషన్ ఉండవని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవడంలో బీజేపీ కనీస నైతికతను, ప్రజాస్వామ్య నిబంధనలను పాటించట్లేదని ఫైర్ అయ్యారు.
ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె తొలిసారి కేరళలో పర్యటించారు. శనివారం తిరువంబాడిలోని ముక్కం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. దానికి తన సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక హాజరై, మాట్లాడారు. వయనాడ్ ప్రజల తరఫున పార్లమెంటులో బలమైన గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు లోక్‌సభలో చర్చలు జరపకుండా బీజేపీ అడ్డుకుంటుందన్నారు.
మీకు సేవ చేసేందుకు రెడీగా ఉన్నా
సేవచేసేందుకు తాను రెడీగా ఉన్నానని వయనాడ్ ప్రజలకు ప్రియాంక స్పష్టం చేశారు. "నియోజక వర్గ ప్రజలకు సమస్య వస్తే పరిష్కరించడానికి నా ఆఫీస్, నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను చేయగలిగినంత అభివృద్ధి చేస్తాను. మీ నమ్మకాలు, విలువలు, ఆకాంక్షలు కాపాడేందుకు చివరి వరకు నిలబడతా. నన్ను గెలిపించినందుకు వయనాడ్ ప్రజలకు మరొక్కసారి కృతజ్ఞతలు" అని ప్రియాంక పేర్కొన్నారు.
వయనాడ్ బాధితులపై మోదీ వివక్ష: రాహుల్
వయనాడ్ విపత్తు బాధితులపై వివక్ష చూపుతూ, ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీకి అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రధాని మోదీపై ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. శనివారం వయనాడ్‌లో ముక్కం వద్ద జరిగిన ఉమ్మడి బహిరంగ సభలో ఎంపీ ప్రియాంకతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘వయనాడ్ ప్రజలపై ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారు. వారికి అందించాల్సిన సాయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.