ఉద్యోగాల భర్తీపై  డబుల్ గేమ్

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు అంటే గతేడాది డిసెంబర్ లో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని టీఆర్ఎస్​ సర్కారు ప్రకటించింది. అయితే అదిగో ఇదిగో అంటూ ఆరేడు నెలలుగా హడావుడి చేస్తున్నారే తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అని, మరోసారి కొత్త జోనల్ వ్యవస్థ అని, ఇంకోసారి ఉద్యోగ ఖాళీల సేకరణ-కేబినెట్​ ఆమోదం అంటూ మభ్యపెట్టారు. ఇక ఇప్పుడు కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఉన్న ఖాళీలన్నీ అలాగే ఉంచి వాటిలో పాత ఉద్యోగులను సర్దుబాటు చేయాలని అటు పాలకులు, ఇటు ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ టీచర్ల హేతుబద్ధీకరణ చేసి 20 వేల టీచర్ పోస్టులు లేకుండా చేయడానికి ఒక ఎత్తుగడ వేస్తున్నారు. ఇలా రకరకాల విభాగాల ఉద్యోగుల విభజన చేస్తూ 50 వేల ఖాళీల అంశాన్ని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగులు ఏడేండ్ల నుంచి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతోంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు జారీ చేయాలి. అప్పుడే నియామకాల కోసం పోరాడిన నిరుద్యోగుల ఆశలు తీరుతాయి.
                                                                                                                                     - రావుల రామ్మోహన్ రెడ్డి, వెల్దండ, జనగాం జిల్లా